Andhra Pradesh: విభజనకు ముందు కాంగ్రెస్ ఏపీకి ద్రోహం చేస్తే.. విభజన తర్వాత బీజేపీ నమ్మించి గొంతు కోసింది!: మంత్రి అమర నాథ రెడ్డి
- ఏపీకి పరిశ్రమలు పోటెత్తుతున్నాయి
- సులభతర వాణిజ్యంలో తొలిస్థానంలో ఉన్నాం
- మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి
కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా ఆంధ్రప్రదేశ్ కు విభజన తర్వాత పరిశ్రమలు పోటెత్తుతున్నాయని ఏపీ మంత్రి అమరనాథ రెడ్డి తెలిపారు. విభజనకు ముందు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేస్తే, విభజన తర్వాత బీజేపీ నమ్మించి గొంతు కోసిందని విమర్శించారు. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే సులభతర వాణిజ్య నిర్వహణలో ఏపీ ఈ ఏడాది తొలిస్థానంలో నిలిచిందని వెల్లడించారు. గుంటూరు జిల్లాలో ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు.
ఏపీ ప్రభుత్వం గత మూడేళ్లలో మూడు అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సులను నిర్వహించిందని పేర్కొన్నారు. ఈ సదస్సుల్లో భాగంగా 2,165 ఒప్పందాలు కుదుర్చుకున్నామని తెలిపారు. దీని కారణంగా రూ.15 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆస్కారం ఏర్పడిందన్నారు. ఇవన్నీ కార్యరూపం దాల్చితే ఏకంగా 32 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. చంద్రబాబు చొరవతోనే ఇదంతా సాధ్యం అయిందని వెల్లడించారు.