USA: ఈ ప్రపంచంలో ఎక్కువగా వేధింపులకు గురయ్యేది నేనే!: మెలానియా ట్రంప్
- అత్యుత్తమంగా ఉండేందుకు ప్రయత్నిస్తా
- అయినా విమర్ళలు చేస్తున్నారు
- ఆఫ్రికా పర్యటనలో దుస్తులపై వివాదం
ఈ ప్రపంచంలో తానే అధికంగా వేధింపులకు గురి అవుతున్నానని అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ అన్నారు. ప్రతి విషయంలో తాను అత్యుత్తమంగా ఉండటానికి ప్రయత్నిస్తాననీ, అయితే దానిని సోషల్ మీడియాలో మరో రకంగా అర్థం చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఇలా ఎందుకు జరుగుతుందో తనకు అర్థం కావడం లేదని వెల్లడించారు. మెలానియా ఇటీవల ఘనా, ఈజిప్ట్ సహా కొన్ని ఆఫ్రికా దేశాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మెలానియా వేసుకున్న దుస్తుల గురించి ఎక్కువగా చర్చ జరిగింది.
మెలానియా ఇటీవల కెన్యా వెళ్లినప్పుడు తెలుపు రంగు పిత్ హెల్మెట్‌ను ధరించి అక్కడి సఫారీ పార్కులో విహరించారు. ఈ బ్రిటిష్ టోపీని ధరించడం.. ఏళ్ల పాటు బ్రిటిష్ పాలనలో మగ్గిన ఆఫ్రికన్లకు కోపం తెప్పించింది. అంతేకాక గత జూన్‌లో టెక్సాస్‌లోని వలసదారుల పిల్లలను నిర్బంధించిన కేంద్రాలను సందర్శించడానికి వెళ్లినప్పుడు మెలానియా ధరించిన జాకెట్‌పై ‘ఐ రియల్లీ డోన్డ్ కేర్. డూ యూ?’ అని రాతలు ఉండడం వివాదాస్పదం అయింది.
అలాగే ఈజిప్ట్ పర్యటనకు వెళ్లినప్పుడు కూడా మెలానియా మైకెల్ జాక్సన్ ఆహార్యాన్ని తలపించేలా తెలుపు చొక్కా, ప్యాంట్, బ్లాక్ టై ధరించి వెళ్లారు. దీంతో విమర్శలు చెలరేగడంతో ఆమె స్పందిస్తూ ‘నా వస్త్రధారణ గురించి కాకుండా నేను చేసిన పనుల గురించి మాట్లాడితే మంచిది’ అని అన్నారు. ఈ నేపథ్యంలో తాను తీవ్రమైన వేధింపులకు గురి అవుతున్నానని మెలానియా అభిప్రాయపడ్డారు.