Amitabh Bachchan: నేర్చుకోవడానికి ఈ జీవితం చాలదు!: అమితాబ్

  • 76 వ పడిలోకి అడుగుపెట్టిన అమితాబ్
  • మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలి
  • ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ షూటింగ్ కష్టమనిపించింది

ఏడు పదుల వయసులోనూ ఆకట్టుకునే నటన ఆయనది. వర్తమాన తారలు ఎందరు పోటీ ఇస్తున్నా ఆయన క్రేజ్ ఏమాత్రం తరగలేదు. తెరపై కనిపిస్తే మురిసి పోయే లక్షలాది అభిమానులు ఆయన సొంతం. నాటి నుంచి నేటి వరకూ అవకాశాల వెల్లువ ఆయన చరిష్మాకు నిదర్శనం.. ఆయనే బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్... గురువారం 76వ పుట్టిన రోజు జరుపుకున్న ఆయన తన అనుభవాలను పంచుకున్నారు. రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న ‘థగ్స్ ఆఫ్ హిందుస్తానీ’ సినిమాతోపాటు పలు ఆసక్తికర అంశాలపై ఇంటర్వూలో ఆయన మనసు విప్పారు.

 పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉంటానని, పుట్టిన రోజు అనేది మిగతా రోజుల్లో ఒకటని, వేడుకలా జరుపుకోవాల్సిన విశేషం ఏమీలేదంటూ తన నిరాడంబరతను చాటుకున్నారు. అమితాబ్. కుటుంబ సభ్యులతో గడపడమే ఆదర్శవంతమైన పుట్టిన రోజు అని, ముఖ్యంగా తన మనువళ్లతో ఉండాలని తాను కోరుకుంటానని కుటుంబానికి తాను ఇచ్చే ప్రాధాన్యతను తెలిపారు. ఇతరులు తమను అభిమానిస్తున్నప్పుడు పొందే సంతృప్తి మరెందులోనూ దొరకదని చెప్పారు. 'నటించడం ఇక చాలు అని, ఇక ఆపేద్దాం అని భావించినప్పుడు ఒక ఆర్టిస్ట్‌గా అది వైఫల్యం అవుతుంది. అలా భావించినప్పుడు తనలోని సృజనాత్మక శక్తి ఓటమి పాలయినట్లే'నని అభిప్రాయపడ్డారు.

'ఏది సాధించడానికైనా జీవితంలో కొన్ని పరిమితులు ఉంటాయి.  నేర్చుకోవడానికి ఈ జీవితం చాలదని తెలుసు. కానీ ప్రతిరోజూ ఏదో ఒక కొత్త అంశాన్ని నేర్చుకోవాలని నేను నమ్ముతాను. కానీ ప్రతి రోజూ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నాను. అంతేకాదు.. ఒక నటుడిగా అందుకోలేని కొన్ని లక్షలాది కలలు నాకు ఉన్నాయి. ఒక నటుడిగా నా పరిధిలో ఉంటూనే నటనను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తాను. ఒక సంగీతకారుడిగా సంగీత వాయిద్యాలను నాకు నేనుగా వాయించాలని భావిస్తాను. ఒక భారతీయుడిగా భారత్ అభివృద్ధి చెందుతున్న దేశంగా కాకుండా ‘అభివృద్ధి చెందిన దేశం’గా పిలిచే రోజు రావాలని నేను ఎల్లప్పుడు కోరుకుంటున్నా'నన్న అమితాబ్ దేశం పట్ల తన బాద్యత తెలియజేశారు.

‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ సినిమా షూటింగ్ కష్టమనిపించింది. కానీ కష్టపడకుండా ఏదీ జరగదు కదా?.. అని తనలోని అంకిత భావాన్ని చాటుకున్నారు అమితాబ్. షూటింగ్ కోసం రెడీ అవడానికి రోజుకు మూడు నుంచి నాలుగు గంటలు సమయం పట్టేది. షూటింగ్ పూర్తైన తర్వాత మేకప్, కాస్ట్యూమ్స్ తీసేయడానికి మరో అరగంట లేదా గంట సమయం పట్టేది. కానీ వృత్తిపరంగా దర్శకులు చెప్పినట్లు నడుచుకోవాల్సిందే కదా? అని అన్నారు అమితాబ్.

‘మీ టూ’ ఉద్యమ నేపథ్యంలో మహిళలపై జరుగున్న లైంగిక వేధింపులపై ఆయన స్పందించారు. 'అసభ్యకరమైన, అక్రమమైన వేధింపుల్లో మహిళలు ప్రధాన బాధితులుగా ఉంటున్నారు. ముఖ్యంగా పని ప్రదేశాల్లో మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి ఘటనలను వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. తగిన చర్యలు తీసుకోవాలి. సమాజంలో మహిళలు, పిల్లలపై అనేక దాడులు జరుగుతున్నాయి. వారికి ప్రత్యేకమైన భద్రత కల్పించాల్సి ఉంది. మహిళలపై పెరిగిపోతున్న ఇలాంటి ఘటనలు బాధాకరం. మహిళలకు తగిన భద్రత కల్పించలేకపోతే రూపుమాపలేని సమస్యగా లైంగిక వేధింపులు తయారవుతాయి' అని అమితాబ్ సూచించారు.

  • Loading...

More Telugu News