Tollywood: అసలైన మృగాల పేర్లు ఇంకా బయటకు రాలేదు.. మీటూ ఉద్యమంపై స్పందించిన తాప్సీ!
- బాధితుల మాటలు వింటే భయమేస్తోంది
- బయటకు వచ్చిన వివరాలు అతి స్వల్పమే
- ట్విట్టర్ లో స్పందించిన నటి
సినీరంగం నుంచి రాజకీయం, మీడియా వరకూ ‘మీ టూ’ ఉద్యమం ప్రకంపనలు సృష్టిస్తోంది. బాలీవుడ్ నటులు నానాపటేకర్, అలోక్ నాథ్, దర్శకుడు సుభాష్, సాజిద్ ఖాన్, తమిళ గీత రచయిత వైరముత్తు, కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ తమను లైంగికంగా వేధించినట్లు ఆరోపిస్తూ పలువురు మహిళలు బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో బాధితులకు అన్నివర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. తాజాగా మీ టూ ఉద్యమంలో భాగంగా తమపై జరిగిన లైంగిక వేధింపులను బయటపెడుతున్న మహిళలకు హీరోయిన్ తాప్సీ మద్దతుగా నిలిచింది.
అసలు మీ టూ కింద బాధితులు బయటపెడుతున్న పేర్ల కంటే, వాళ్లు ఏ రకంగా లైంగిక వేధింపులకు గురయ్యారో వివరిస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తోందని తాప్సీ వ్యాఖ్యానించింది. ఇప్పటివరకూ బాధితులు చెప్పిన వివరాలు అతి స్వల్పమేననీ, మహిళా ఆర్టిస్టులు, నటీమణులను వేధించుకుతినే అసలైన మృగాల పేర్లు ఇంకా బయటకు రాలేదని తనకు అనిపిస్తోందని వెల్లడించింది. ఈ మేరకు మీ టూ హ్యష్ ట్యాగ్ తో తాప్సీ ఓ ట్వీట్ చేసింది.