mohanlal: మొదలేకాని వేయికోట్ల 'మహాభారతం' .. రచయిత అసహనం!
- వాసుదేవన్ నాయర్ నవల 'రాందమూళం'
- భీముడు ప్రధాన పాత్రగా 'మహాభారతం'
- ఆర్థికపరమైన సమస్యల్లో నిర్మాత
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం వలన, 'మహాభారతం' చిత్రాన్ని రూపొందించడానికి అన్ని భాషల్లోనూ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే 1000 కోట్లతో మలయాళంలో 'మహాభారతం' నిర్మితమవుతుందనీ .. ఇది దాదాపుగా అన్ని భాషల్లోను విడుదలవుతుందని ఆ మధ్య మోహన్ లాల్ చెప్పారు. వాసుదేవన్ నాయర్ రాసిన 'రాందమూళం' అనే నవల ఆధారంగా రూపొందే ఈ సినిమాకి శ్రీకుమార్ దర్శకుడిగా వ్యవహరిస్తాడని అన్నారు.
భీముడి పాత్రను ప్రధానంగా చేసుకుని ఈ కథ కొనసాగుతుందనీ .. ఈ పాత్రలో తానే నటిస్తానని ఆయన చెప్పారు. అయితే అప్పటి నుంచి కూడా ఈ ప్రాజెక్టు ఎంతమాత్రం ముందుకు కదలడం లేదు. దాంతో సినిమా తీసే ఉద్దేశం లేకపోతే తన స్క్రిప్ట్ తనకి ఇచ్చేయమని వాసుదేవన్ నాయర్ డిమాండ్ చేస్తున్నారు. ఈ సినిమాను నిర్మిస్తానని చెప్పిన దుబాయ్ వ్యాపారవేత్త ఇటీవల ఆర్థికపరమైన సమస్యల్లో పడటమే ఈ ఆలస్యానికి కారణమని చెప్పుకుంటున్నారు.