meetoo: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ ప్రముఖుల జాబితా ఇదే!
- బాలీవుడ్ ను షేక్ చేస్తున్న మీటూ
- ఇప్పటికే పలువురు ప్రముఖులపై ఆరోపణలు
- 'హౌస్ ఫుల్-4' దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్న సాజిద్ ఖాన్
ప్రముఖ నటుడు నానా పటేకర్ తనను లైంగికంగా వేధించాడంటూ నటి తనుశ్రీ దత్తా ఆరోపించినప్పటి నుంచి మీటూ ఉద్యమం ఊపందుకుంది. పలువురు ప్రముఖులపై ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో బాలీవుడ్ షేక్ అవుతోంది. ఇప్పటి దాకా లైంగిక ఆరోపణలను ఎదుర్కొన్న వారి వివరాలు ఇవిగో..
నానా పటేకర్: ఈ జాబితాలో తొలి పేరు నానాదే. 2008లో 'హార్న్ ఓకే ప్లీజ్' చిత్రం షూటింగ్ సందర్భంగా పటేకర్ తనను వేధించాడని తనుశ్రీ ఆరోపించింది.
అలోక్ నాథ్: ఇతనిపై టీవీ డైరెక్టర్, రచయిత వినితా నంద ఆరోపణలు గుప్పించారు. ఈమె తర్వాత మరి కొందరు మహిళలు తమను లైంగికంగా వేధించారని ఆరోపించారు.
వికాస్ బహల్: వికాస్ బహల్ ను విమర్శించిన వారిలో హీరోయిన్ కంగనా రనౌత్ కూడా ఉంది.
సుభాష్ ఘాయ్: ఎంతో పేరున్న సుభాష్ పై ట్విట్టర్ ద్వారా ఓ మహిళ ఆరోపణలు గుప్పించింది. తనకు డ్రగ్స్ ఇచ్చి, అత్యాచారం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది.
రజత్ కపూర్: బాలీవుడ్ లో పాప్యులర్ యాక్టరైన రజత్ పై ఓ మహిళ ఆరోపణలు చేసింది. తనను లైంగికంగా వేధించారని తెలిపింది.
కైలాష్ ఖేర్: గాయకుడు కైలాష్ ఖేర్ తనను వేధించాడని మహిళా గాయని సోనా మహాపాత్ర ఆరోపించింది. తన తొడపై చేతులు వేశాడని తెలిపింది.
అభిజిత్ భట్టాచార్య: ఒక పార్టీలో అభిజిత్ తన పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడని ఓ మహిళ ట్విట్టర్ ద్వారా తెలిపింది. అయితే, ఆమె ఎవరో కూడా తనకు తెలియదని అభిజిత్ అన్నాడు.
సాజిద్ ఖాన్: తనను లైంగికంగా వేధించాడంటూ సాజిద్ పై ఓ మహిళా జర్నలిస్టు ఆరోపించింది. ఈ నేపథ్యంలో 'హౌస్ ఫుల్-4' దర్శకత్వ బాధ్యతల నుంచి సాజిద్ తప్పుకున్నాడు.