Uganda: ఉగాండాలో విరిగిపడిన కొండచరియలు.. కనిపించకుండా పోయిన స్కూలు.. 36 మంది మృతి!
- ఉగాండాను ఊపేస్తున్న భారీ వర్షాలు
- నివాస స్థలాలపై విరిగిపడిన కొండ చరియలు
- కొనసాగుతున్న సహాయక చర్యలు
భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడి 36 మందికిపైగా మృతి చెందిన ఘటన ఉగాండాలోని బుడుదా జిల్లాలో జరిగింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు దేశంలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న నది ఉద్ధృతంగా ప్రవహించడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బుకలాసి ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి కిందనున్న నివాసాలపై పడడంతో కనీసం 36 మంది మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నారని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. బాధితులను కాపాడేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున రెస్క్యూ బృందాలను పంపింది.
బురద కింద ఓ స్కూలు కూరుకుపోయి కనిపించకుండా పోవడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీస్తున్నారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన రెడ్‌క్రాస్ సంస్థ తమ ప్రతినిధులను బుకలాసి పంపింది. దుప్పట్లు, టార్పాలిన్లు, తాగునీరు, ఆహార పదార్థాలు, మందుల్ని పంపించింది. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.