Marri Sasidhar Reddy: ఇష్టం ఉన్నవారి ఓట్లు ఉంచి మిగతావారివి తీసేస్తున్నారు: మర్రి శశిధర్‌రెడ్డి
- ఎన్నికల కమిషన్ చెప్పిన అంశాల్లో తప్పులున్నాయి
- ఓటర్లు తుది జాబితాను అర్థరాత్రి విడుదల చేశారు
- హైకోర్టును తప్పుదోవ పట్టించారు
రాష్ట్రంలో ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఇష్టానుసారంగా చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ చెప్పిన అంశాల్లో చాలా తప్పులున్నాయని అన్నారు. ఫెడరల్ ఫ్రంట్‌తో దేశంలో గుణాత్మక మార్పు తెస్తానంటున్న కేసీఆర్.. ఇలా ఓటర్ల నమోదులో అవకతవకలు చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. హైకోర్టును తప్పుదోవ పట్టించేలా చెప్పిన అంశాలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని శశిధర్‌రెడ్డి తెలిపారు. ఇంటింటికీ వెళ్లి ఓట్లు నమోదు చేయాలని.. కానీ అలా జరగడం లేదన్నారు.
ఓటర్ల తుది జాబితాను అర్ధరాత్రి విడుదల చేశారంటూ ఆయన మండిపడ్డారు. ఇష్టం ఉన్న వారి ఓట్లు ఉంచి మిగతావారివి తీసేస్తున్నారని శశిధర్‌రెడ్డి విమర్శించారు. ఇదంతా తెరాస ప్రభుత్వ ప్రోద్బలంతోనే జరుగుతోందని ఆయన ఆరోపించారు. దేశసమగ్రత కోసం యువత జాగృతం కావాలని పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలని ఆయన సూచించారు. ఓటర్లకు న్యాయం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని శశిధర్‌రెడ్డి చెప్పారు.