Rajasthan: ఆ పది రోజులూ చాల్లే... రాజస్థాన్ లోనూ విజయం మనదే: నేతలకు నరేంద్ర మోదీ భరోసా
- రాజస్థాన్ లో బీజేపీ ఓడిపోనుందని చెబుతున్న సర్వేలు
- ఆందోళన వద్దని నేతలకు మోదీ భరోసా
- అంతా సెటిల్ అవుతుందని చెప్పిన నరేంద్ర మోదీ!
"మీకు ఎటువంటి ఆందోళనా వద్దు. అంతా సవ్యంగానే జరుగుతుంది. ఎన్నికల్లో విజయం మనమే సాధిస్తాం" అని ప్రధాని నరేంద్ర మోదీ, తనను కలిసిన కొందరు రాజస్థానీ నేతలతో వ్యాఖ్యానించారు. అజ్మీర్ లో జరిగిన ర్యాలీ ముగిసిన తరువాత, మోదీని కొందరు నేతలు కలవగా, ఆయనే ఎన్నికల ఫలితాల ప్రస్తావన తీసుకొచ్చి, పరిస్థితి ఎలా ఉందని ప్రశ్నించారట. ప్రస్తుతం ఎన్నికలు జరిగే అన్ని రాష్ట్రాల్లో ఒక్క రాజస్థాన్ లో మాత్రమే, బీజేపీ గట్టి పోటీ ఎదుర్కొంటోందని, ఓడిపోతామేమోనని వారు చెప్పేసరికి, ఆ ఆలోచనే వద్దని, అంతా సెట్ అవుతుందని మోదీ భరోసా ఇచ్చారట.
వాస్తవానికి మధ్యప్రదేశ్ లో ఎన్నికల ప్రచారానికి నవంబర్ 26 చివరి తేదీకాగా, ఆపై రాజస్థాన్ లో ఎన్నికల ప్రచారానికి డిసెంబర్ 5 వరకూ సమయం ఉంటుంది. ఈ పది రోజుల్లో నరేంద్ర మోదీతో పాటు, అమిత్ షాలు వేర్వేరుగా రాష్ట్రం మొత్తం చుట్టి రావాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ కీలకమైన రాజపుత్, గుజ్జర్, జాట్, మీనా, బ్రాహ్మణ వర్గాల ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు వ్యూహాలు సిద్ధం చేశారని సమాచారం. వివిధ వర్గాల నేతలతో నిత్యమూ మాట్లాడుతున్న అమిత్ షా, రాజస్థాన్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరాదని భావిస్తున్నారు.
అయితే, గత నాలుగేళ్లుగా ఎంతో మంది బీజేపీ సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పలు సర్వేలు సైతం వసుంధరా రాజే ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారని, ఈ దఫా బీజేపీకి ఓటమి తప్పదని తేల్చాయి.