Tirumala: తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు... కొండపైకి ద్విచక్ర వాహనాల నిషేధం... వాహనాల పార్కింగ్ తిరుపతిలోనే!
- నేడు బ్రహ్మాండ నాయకుని గరుడోత్సవం
- అద్దె గదులు దొరకక వసతి సముదాయాల్లో భక్తులు
- భక్తులతో నిండిపోయిన మాడవీధులు
- ఈ ఉదయం మోహినీ అవతారం
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు గరుడోత్సవం జరుగుతుండగా, ఏడుకొండలూ భక్తులతో కిక్కిరిసిపోయాయి. లక్షలాదిగా భక్తులు కొండపైకి తరలి రావడంతో తిరుమలలోని అన్ని పార్కింగ్ స్లాట్లూ నిండిపోగా, ఆపై వస్తున్న వాహనాలకు అలిపిరిలోనే పార్కింగ్ చేయిస్తున్నారు. దీంతో ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతున్నాయి. కొండపైకి కేవలం ఆర్టీసీ బస్సులను, వీఐపీల వాహనాలను మాత్రమే అనుమతిస్తున్న పరిస్థితి. గత రాత్రి నుంచి కొండపైకి ద్విచక్ర వాహనాలను నిషేధించారు.
నేడు బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టమైన గరుడోత్సవం జరుగనుండగా, దేవదేవుని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు అద్దె గదులు దొరకక షెడ్లలో, వసతి సముదాయాల్లో అవస్థలు పడుతున్నారు. గరుడోత్సవం కోసం వచ్చే డోనర్ల కోసం సామాన్యులకు గదుల కేటాయింపును టీటీడీ రద్దు చేసిన సంగతి తెలిసిందే. నేటి ఉదయం మోహినీ అవతారంలో దేవదేవుడు భక్తులకు దర్శనం ఇవ్వనుండగా, ఇప్పటికే తిరుమాడ వీధులు భక్తులతో కిక్కిరిసి పోయాయి. వారంతా రాత్రి గరుడసేవ ముగిసేంత వరకూ అక్కడే వేచి వుండే అవకాశం ఉండటంతో, వారికి కావాల్సిన అన్నపానీయాలను మాడ వీధుల్లోనే అందించే ఏర్పాట్లు చేసినట్టు అధికారులు ప్రకటించారు.