KCR: అక్కడ మహిళల ఓట్లే కీలకం... కేసీఆర్, ఉత్తమ్, జానా, కేటీఆర్, రేవంత్ ల స్థానాలలో పరిస్థితి ఇదే!
- 57 నియోజకవర్గాల్లో మహిళల ఓట్లు అధికం
- ఆక్కడి నుంచి పోటీ పడుతున్న ప్రముఖులు
- మహిళల మద్దతు లభిస్తేనే ఆసెంబ్లీలోకి
తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ పార్టీ శాసనసభా పక్ష నేత జానారెడ్డి, మంత్రి హరీశ్ రావు, యువనేత కేటీఆర్, కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి... వీరంతా మహిళల మద్దతు పొందితేనే ఘన విజయం సాధించి అసెంబ్లీలో కాలుమోపే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే, వీరంతా మహిళా ఓట్లు అధికంగా ఉన్న నియోజకవర్గాల నుంచే పోటీ చేయనున్నారు కాబట్టి.
తెలంగాణలోని 57 నియోజవర్గాల్లో పురుషుల ఓట్ల కన్నా మహిళల ఓట్లే అధికంగా ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పురుష జనాభా 1.89 కోట్లు ఉండగా, మహిళల జనాభా 1.90 కోట్లుగా ఉంది. ఇక వీరిలో ఓటర్ల విషయానికి వస్తే, 2014 లెక్కల ప్రకారం మొత్తం ఓటర్లు 2.89 కోట్లు కాగా, అందులో మహిళా ఓటర్ల సంఖ్య పురుషులతో పోలిస్తే 14 లక్షలు తక్కువ ఉండేది. ఇక తాజాగా విడుదలైన జాబితాను పరిశీలిస్తే, స్త్రీ, పురుష ఓటర్ల మధ్య తేడా 2.59 లక్షలు మాత్రమే.
మహిళా ఓటర్లు అధికంగా ఉన్న నియోజకవర్గాల నుంచే ప్రముఖ అభ్యర్థులంతా పోటీలో ఉన్నారు. గజ్వేల్ (కేసీఆర్), సిద్దిపేట (హరీశ్ రావు), సిరిసిల్ల (కేటీఆర్), హుజూర్ నగర్ (ఉత్తమ్ కుమార్ రెడ్డి), నాగార్జున సాగర్ (జానారెడ్డి), కొడంగల్ (రేవంత్ రెడ్డి) తదితర నియోజకవర్గాల్లో పురుషుల ఓట్ల కన్నా మహిళల ఓట్లే అధికంగా ఉన్నాయి. దీంతో ఆయా నియోజకవర్గాల్లో నేతల గెలుపోటములు మహిళల చేతుల్లో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.