KCR: కల్వకుర్తి అసమ్మతి సెగలు... నేటి కేటీఆర్ బహిరంగ సభ వాయిదా!
- జైపాల్ యాదవ్ కు టికెట్ కన్ఫార్మ్ చేసిన టీఆర్ఎస్
- తనకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న కసిరెడ్డి
- అసమ్మతి నేతల వైఖరితో సభ వాయిదా
మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్ఎస్ నేతల అసంతృప్తి, నేడు జరగాల్సిన కేటీఆర్ బహిరంగ సభ వాయిదా పడేలా చేసింది. టీఆర్ఎస్ అసంతృప్తుల్లో ముఖ్యుడైన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, కేటీఆర్ బహిరంగ సభకు సహకరించేది లేదని కరాఖండీగా చెప్పడంతో, టీఆర్ఎస్ నేతలు సభను వాయిదా వేయక తప్పలేదు.
కల్వకుర్తిలో టీఆర్ఎస్ తరఫున తాజా మాజీ జైపాల్ యాదవ్ కు టికెట్ ను కేటాయించిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటివరకూ తనకు టికెట్ లభిస్తుందని భావిస్తూ వచ్చిన కసిరెడ్డి, మనస్తాపానికి గురయ్యారు. ఇక్కడ జైపాల్ యాదవ్ గెలిచే పరిస్థితి లేదని, ఆయన్ను మార్చాలని చెబుతూ, తన అనుచరులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయించి తీర్మానాలను చేసి అధిష్ఠానానికి పంపుతున్నారు.
ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు కల్వకుర్తిలో రోడ్ షో, బహిరంగ సభను ఏర్పాటు చేయగా, కేటీఆర్ పాల్గొనాల్సి వుంది. ఈ సమావేశానికి తాను, తన అనుచరులు సహకరించబోమని కసిరెడ్డి స్పష్టం చేయడంతో, ఆయనకు సర్ది చెప్పేందుకు స్వయంగా కేటీఆర్ రంగంలోకి దిగినా ఫలితం లేకపోయింది. ఈ సభకు రావాలని, సమస్యలుంటే తరువాత పరిష్కరించుకుందామని కేటీఆర్ చెప్పినా కసిరెడ్డి వినలేదని తెలుస్తోంది. ఇక్కడ కసిరెడ్డి సహకారం లేకుండా సభను నిర్వహిస్తే, జన సమీకరణ క్లిష్టతరమవుతుందని భావించిన టీఆర్ఎస్ నేతలు, ఈ సభను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించడం గమనార్హం.