Mulugu: కొడుకు పదవి కోసం ఉద్యమాన్ని తాకట్టుపెట్టిన మంత్రి చందులాల్ : సీతక్క ధ్వజం
- ఆయనకు మార్కెట్ కమిటీ పదవే ముఖ్యమైంది
- ములుగు నియోజకవర్గానికి కూడా చేసిందేమీ లేదు
- కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సమ్మక్క సారక్క జిల్లాగా పేరు మార్పు
ములుగు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ధనసరి సీతక్క స్థానిక మంత్రి చందులాల్పై ఫైర్ అయ్యారు. మంత్రిగా ఉన్నా జిల్లాకు ఆయన చేసింది ఏమీ లేకపోగా కొడుకు పదవి కోసం ఉద్యమాన్ని తాకట్టుపెట్టారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మహబూబాబాద్ కొత్తగూడ మండలం రామన్నగూడెంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. ములుగు కేంద్రంగా సమ్మక్క సారక్క జిల్లా ఏర్పాటు చేయాలని ప్రజలు ఉద్యమాలు చేస్తుంటే కొడుకుకి మార్కెట్ కమిటీ పదవి ఎక్కడ దక్కకుండా పోతుందోనని మంత్రి దాన్ని నీరుగార్చారని విమర్శించారు.
గతంలో వేసిన రోడ్లపైనే ఇప్పుడు కేంద్రం ఇచ్చిన నిధులతో రోడ్లు వేస్తూ అదే అభివృద్ధి అని చెబుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ములుగు కేంద్రంగా సమ్మక్క సారక్క జిల్లా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు.
మళ్లీ గెలిపిస్తే టైగర్ జోన్ పేరుతో పోడు భూములను కూడా స్వాధీనం చేసుకుని అక్కడి నుంచి గిరిజనులను వెళ్లగొట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. మిషన్ కాకతీయతో వలసలు తగ్గిపోతాయని చెప్పిన కేసీఆర్ రామన్నగూడెం తండా ప్రజలు వలస పోవడానికి కారణాలేంటో చెప్పాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజల కష్టాలు తీరుతాయని, ఆలోచించి ఓటు వేయాలని కోరారు.