sabarimala: అయ్యప్ప ఆలయంలోకి మహిళ ప్రవేశంపై సుప్రీం తీర్పుతో అట్టుడుకుతున్న కేరళ
- ప్రవేశానికి అనుమతిస్తే ఆత్మాహుతి చేసుకుంటామని కేరళ ఆర్ఎస్ఎస్ విభాగం హెచ్చరిక
- కోర్టు తీర్పును ఉ్లంఘిస్తున్నారు...నేను ఆలయ దర్శనం చేసుకుంటానన్న తృప్తి దేశాయ్
- ఆమె ప్రకటనను తప్పుపట్టిన పందళం రాచ కుటుంబీకుడు శశికుమార్ వర్మ
శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ దేశ అత్యున్నత న్యాయ స్థానం తీర్పు ఇచ్చిన నేపథ్యంలో వాద, ప్రతివాదనలతో కేరళ రాష్ట్రం అట్టుడికిపోతోంది. కొందరు తీర్పుకు అనుకూలంగా, ఎక్కువ మంది తీర్పుకు వ్యతిరేకంగా నినదిస్తూ రోడ్డెక్కుతున్నారు. ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఖండనలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది.
ఈ నెల 16న అయ్యప్ప ఆలయం తలుపులు తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో శివసేన కేరళ విభాగం ఘాటైన వ్యాఖ్యలు చేసింది. కోర్టు తీర్పు మతపరమైన నమ్మకాన్ని పరిహసించడమేనని వ్యాఖ్యానించింది. వేలాది మంది శివసేన కార్యకర్తలు ఆత్మాహుతి దళంగా మారి పంపానది నుంచి ఆలయం వరకు వరుసగా నిలబడతామని, యువతులను ఆలయంలోకి అనుమతిస్తే ఆత్మహత్యలు చేసుకుంటామని శివసేన నేత పెరింగమ్మ అజీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
మరోవైపు శని శింగణాపూర్ ఆలయంలోకి మహిళల ప్రవేశం కోసం పోరాడిన తృప్తి దేశాయ్ ఆందోళన కారుల చర్యలను తప్పుపట్టారు. ఇది కోర్టు తీర్పును ఉల్లంఘించడమేనన్నారు. తాను త్వరలోనే శబరి కొండకు వచ్చి అయ్యప్పను దర్శించుకుంటానని ప్రకటించారు.
తృప్తి దేశాయ్ ప్రకటనపై పందళం రాచకుటుంబీకుడు శశికుమార్ వర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రెచ్చగొట్టే ప్రకటనలు, చర్యలు మానుకోవాలని హితవు పలికారు. ఇంకోవైపు కొచ్చిలో వేలాది మంది ఆందోళన కారులు రోడ్డెక్కారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలయ సంస్కృతిని కాపాడాలని నినదించారు. వీరిలో ఎక్కువ మంది మహిళలే ఉండడం గమనార్హం. ఆందోళనకారులు వ్యూహాత్మకంగా 200 ప్రాంతాల్లో ఆందోళనకు దిగడంతో రాష్ట్రం స్తంభించిపోయింది.
బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమక్రటిక్ అలయెన్స్ సోమవారం నిరసన తెలియజేయాలని నిర్ణయించింది. మరోవైపు కాంగ్రెస్ కూడా తీర్పును వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపడుతోంది. ఆలయంలోకి ప్రవేశించాలని ప్రయత్నించిన మహిళలను అడ్డంగా నరికేయాలని నటుడు కొల్లం తులసి ప్రకటన సంచలనమైంది. ఇతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
శబరిమల ఆలయంలోకి మహిళల్ని అనుమతిస్తే ఆ ప్రాంతం మరో థాయ్ల్యాండ్లా మారుతుందని వ్యాఖ్యానించి టీడీబీ మాజీ అధ్యక్షుడు ప్రయర్ గోపాలకృష్ణ మరో సంచలనానికి తెరలేపారు. ఈ వ్యవహారాలన్నీ గమనిస్తున్న టెంపుల్స్ ప్రొటెక్షన్ మూవ్మెంట్ కన్వీనర్ డాక్టర్ ఎం.వి.సౌందరరాజన్ ప్రధాని జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అటార్నీజనరల్ సలహాతో కోట్లాది మంది అయ్యప్ప భక్తుల కోసం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.