CM Ramesh: అధికార పార్టీతో పెట్టుకుంటే ఇలాంటి దాడులు తప్పవని ఓ అధికారి హెచ్చరించాడు: సీఎం రమేశ్
- మా వద్ద మాట్లాడే ధైర్యం లేకనే ఈ వ్యాఖ్యలు చేశారు
- ఆ అధికారి చేసిన వ్యాఖ్యలపై ఉన్నతాధికారికి చెప్పా
- ఆ అధికారిని మా ఆఫీసు నుంచి బయటకు పంపేశారు
‘అధికార పార్టీతో పెట్టుకుంటే ఇలాంటి దాడులే జరుగుతాయని మీకు తెలియదా?' అని తనిఖీలకు వచ్చిన ఓ అధికారి తమ ఆఫీసు సిబ్బందితో వ్యాఖ్యలు చేశారని సీఎం రమేశ్ చెప్పారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తన వద్ద, తన భార్య వద్ద మాట్లాడే ధైర్యం లేకనే ఆ అధికారి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఈ సమాచారం తెలుసుకున్న తాను ఉన్నతాధికారికి ఫోన్ చేసి సదరు అధికారి చేసిన వ్యాఖ్యల గురించి చెప్పానని అన్నారు. ఈ వ్యాఖ్యలు చేసిన అధికారి పేరు ‘మదన్’ అని చెప్పారు.
‘మీ బాస్ లకు చెప్పండి.. అధికార పార్టీకి అనుకూలంగా వెళ్లమనండి. వ్యతిరేకంగా చేస్తే ఇలానే జరుగుతుంది. మీకు ఆమాత్రం అర్థం కాదా? హైదరాబాద్ లో ఎంతమంది ఎన్ని లక్షల కోట్ల పనులు చేస్తున్నారో మీకు తెలియదా? వాళ్లకు ఏమన్నా జరుగుతున్నాయా? మీకే ఎందుకు జరుగుతున్నాయి? ఇప్పుడు మేము వచ్చామంటే మీకు అర్థం కావడం లేదా? మీ వాళ్లకు చెప్పండి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే ఇలాంటి దాడులు కొనసాగిస్తామని.. ఇంకా ఎక్కువ చేస్తామని’ అని అధికారి మదన్ తమ సిబ్బందితో చెప్పారని సీఎం రమేశ్ అన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారికి ఫోన్ ద్వారా తెలియజేశానని, ఆ అధికారిని వెంటనే తమ ఆఫీసు నుంచి బయటకు పంపివేశారని చెప్పారు.