Gujarat: ఫేస్ బుక్ లో నకిలీ ప్రొఫైల్ తో యువకుడికి వల.. పెళ్లి చేసుకోవడం కోసం కిడ్నాప్ చేయించిన యువతి!
- పెళ్లి ఖర్చుల కోసం మరో రూ.12 లక్షలు డిమాండ్
- పోలీసులను ఆశ్రయించిన కుటుంబ సభ్యులు
- ఐదుగురిని అరెస్ట్ చేసిన అధికారులు
సోషల్ మీడియాతో లాభం ఎంతుందో నష్టం కూడా అదే స్థాయిలో ఉంటోంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో టచ్ లో ఉండేందుకు, వ్యాపారాలను విస్తరించుకునేందుకు చాలామంది దీన్ని ఓ సాధానంగా వాడుతుంటే, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించేందుకు కొందరు దీన్ని అడ్డాగా మార్చుకుంటున్నారు.
తాజాగా ఓ అందమైన అమ్మాయి ఫ్రొఫైల్ తో యువకుడిని ట్రాప్ చేసిన ఓ ముఠా, తమ సభ్యురాలిని పెళ్లి చేసుకోవాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా భారీగా డబ్బు ఇవ్వాలని యువకుడి కుటుంబ సభ్యులను డిమాండ్ చేసింది. చివరికి పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఓ యువతి సహా ఐదుగురు ముఠా సభ్యులను కటకటాల వెనక్కు నెట్టారు.
గుజరాత్ లోని రాజ్ కోట్ కు చెందిన సురేశ్ ఛబ్రియాకు ఫేస్ బుక్ లో ఓ యువతి పరిచయమైంది. యువతే తొలుత ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపగా, దీనికి సురేశ్ అంగీకరించాడు. ఈ క్రమంలో ఇద్దరు ఒకరికొకరు నచ్చడంతో ఆదివారం స్థానిక పార్కులో కలుసుకుందామని నిర్ణయించుకున్నారు. అయితే సురేశ్ పార్కులోకి రాగానే నలుగురు యువకులు అతడిని చుట్టుముట్టారు. ‘మా చెల్లితోనే మాట్లాడతావా’ అంటూ చావగొట్టారు.
అనంతరం బాధితుడిని ఓ రహస్య ప్రాంతానికి ఎత్తుకెళ్లారు. ఫేస్ బుక్ లో చాటింగ్ చేసిన యువతిని పెళ్లి చేసుకోవాలని హుకుం జారీచేశారు. తాను చాట్ చేసిన యువతికి, తన ముందు నిల్చున్న యువతికి సంబంధం లేకపోవడంతో బాధితుడు విస్తుపోయాడు. అలాగే పెళ్లి ఖర్చుల కోసం రూ.12 లక్షలు ఇవ్వాలని అతని కుటుంబ సభ్యులను బెదిరించారు.
దీంతో బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో నిందితుల కోసం పక్కా ప్లాన్ వేసిన పోలీసులు డబ్బులు తీసుకునేందుకు రావాలని కిడ్నాపర్లకు కుటుంబ సభ్యుల చేత ఫోన్ చేయించారు. సురేశ్ కుటుంబీకుల మాటలు నమ్మిన కిడ్నాపర్లు అక్కడకు రాగానే, మాటేసిన పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాపర్లను తమదైన శైలిలో విచారించడంతో సురేశ్ ను ఎక్కడ దాచారో చెప్పేశారు. దీంతో బాధితుడిని కాపాడిన పోలీసులు ప్రధాన నిందితురాలు నీతూ రావల్ తో పాటు షాను, అఫ్జల్, అసిఫ్, హరికృష్ణ సింగ్ లను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు నెట్టారు.