Gurugram: న్యాయమూర్తి ఇంట తీరని విషాదం... కాల్పులకు గురైన భార్య మృతి, కొడుకు బ్రెయిన్ డెడ్!
- శనివారం నాడు గురుగ్రామ్ లో ఘటన
- న్యాయమూర్తి భార్య, కొడుకుపై సెక్యూరిటీ సిబ్బంది కాల్పులు
- తీవ్ర రక్తస్రావంతో భార్య మృతి
- కుమారుడి మెదడులోకి బులెట్
గురుగ్రామ్ లో తీవ్ర కలకలం రేపిన న్యాయమూర్తి కిషన్ కాంత్ కుటుంబ సభ్యులపై తుపాకి కాల్పుల ఘటనలో తీవ్రగాయాల పాలైన భార్య రీతూ (38) మరణించగా, కుమారుడు ధ్రువ్ (18) బ్రెయిన్ డెడ్ అయ్యాడు. ఈ విషయాన్ని వీరికి చికిత్స అందించిన మేదాంత మెడికల్ హాస్పిటల్ పేర్కొంది.
రీతూ గుండెల్లోకి రెండు బులెట్లు దిగాయని, తీవ్రమైన రక్తస్రావం ఆమె ప్రాణం తీసిందని వెల్లడించిన సీనియర్ ఫోరెన్సిక్ నిపుణుడు డాక్టర్ దీపక్ మాథుర్, ధ్రువ్ కు తలలోకి బులెట్ దిగిందని, క్రిటికల్ లైఫ్ సపోర్టు సిస్టమ్ పై ఉంచామని తెలిపారు. వీరిద్దరిపై కిషన్ వ్యక్తిగత భద్రతాధికారి మహిపాల్ సింగ్ కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే.
ఆ తరువాత తాను కాల్పులు జరిపినట్టు కిషన్ కు ఫోన్ చేసి తెలిపిన మహిపాల్, ఫరీదాబాద్ పారిపోతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయమూర్తి కుటుంబ సభ్యులపై మహిపాల్ ఎందుకు కాల్పులకు తెగబడ్డాడన్న విషయాన్ని విచారిస్తున్నారు.