Yanamala: జగన్ ను వెనకేసుకొస్తున్న పవన్ కల్యాణ్: యనమల విమర్శలు
- చంద్రబాబును విమర్శించడం తప్ప మరేమీ లేదు
- జగన్ అవినీతి గురించి తెలియదనడం విడ్డూరం
- కవాతులో పవన్ వ్యాఖ్యలపై యనమల అభ్యంతరం
నిన్న ధవళేశ్వరంలో జనసేన జరిపిన కవాతు సందర్భంగా జరిగిన సభలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ ఆర్థికమంత్రి యనమల మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ను పవన్ కల్యాణ్ వెనకేసుకుని వస్తున్నారన్న విషయం ఈ సభతో ప్రజలందరికీ తెలిసిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన యనమల, పవన్ ప్రసంగంలో చంద్రబాబును విమర్శించడం మినహా కొత్తదనమేమీ లేదని అన్నారు. జగన్ చేసిన అవినీతి గురించి తనకు తెలియదని చెప్పడం విడ్డూరమని, అది ఆయనకు అండగా నిలబడుతున్నట్టు చెప్పకనే చెప్పినట్టని యనమల అభిప్రాయపడ్డారు.
అవినీతిరహిత రాష్ట్రాల్లో ఏపీ మూడవ స్థానంలో ఉందని సర్వేలే చెబుతున్నాయని, టీడీపీ పారదర్శక పాలనపై ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలని ఆయన ప్రశ్నించారు. ఎవరైనా అవినీతిపై పోరాడాలంటే, జగన్ పై పోరాడాలని, రాఫెల్ స్కామ్ సూత్రధారి నరేంద్ర మోదీపై పోరాడాలని అన్నారు. ప్రస్తుతం జగన్, పవన్ ల దృష్టంతా సీఎం కుర్చీపైనే ఉందని, పదవుల కోసం రాజకీయాలు చేయడాన్ని ప్రజలు ఎన్నడూ ఆమోదించబోరని వ్యాఖ్యానించారు.