Telugudesam: సినిమాల్లో వారసత్వం లేదా? రాజకీయాల్లో ఎందుకు ఉండకూడదు?: పవన్ ని ప్రశ్నించిన జలీల్ ఖాన్
- పవన్ కల్యాణ్ సినిమాల్లోకి ఎలా వచ్చారు?
- మీ కుటుంబంలోని హీరోలది వారసత్వం కాదా?
- వచ్చే ఎన్నికల్లో ‘జనసేన’కు ఒక్క స్థానం కూడా రాదు
రాజకీయ వారసత్వంపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిన్న చేసిన వ్యాఖ్యలపై విజయవాడ టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ స్పందించారు. పవన్ పై ప్రశ్నలు సంధించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, సినిమాల్లో వారసత్వం లేదా? అని ప్రశ్నించారు. మరి, అలాంటప్పుడు, రాజకీయాల్లో ఎందుకు ఉండకూడదని అన్నారు. పవన్ కల్యాణ్ సినిమాల్లోకి ఎలా వచ్చారు? మీ కుటుంబంలో అంతమంది హీరోలు అయింది వారసత్వంతో కాదా? అని ప్రశ్నించారు. సినిమాల్లో అవకాశాలు లేకపోవడం వల్లే పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారని వ్యాఖ్యానించారు.
నిన్నటి ‘జనసేన’ కవాతులో పవన్ కల్యాణ్ పై పూల వర్షం కురవడాన్ని ఈ సందర్భంగా జలీల్ ఖాన్ ప్రశ్నించారు. తమది పేద పార్టీ అని చెప్పుకునే పవన్ కల్యాణ్ కు ఆకాశం నుండి పూలు చల్లించుకునేంతటి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు. పవన్ తన ప్రసంగాల్లో బీజేపీ రాసిచ్చిన స్క్రిప్ట్ నే చదువుతున్నారని విమర్శించారు. నాడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి 18 సీట్లు అయినా వచ్చాయని, వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకి కనీసం ఒక్క స్థానం కూడా దక్కదని జోస్యం చెప్పారు.