Kerala: శబరిమలకు వచ్చే మహిళా భక్తులను అడ్డుకుంటున్న ఆందోళనకారులు.. పరిస్థితి ఉద్రిక్తం
- సుప్రీం ఆదేశాల అమలుకు కేరళ ప్రభుత్వం సిద్ధం
- వాహనాలను అడ్డుకుంటున్న ఆందోళనకారులు
- మహిళా భక్తులకు భద్రత కల్పిస్తామంటున్న సీఎం
శబరిమల ఆలయానికి 10-50 సంవత్సరాల లోపు మహిళలు కూడా వెళ్లొచ్చంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. రేపు అయ్యప్ప స్వామి ఆలయం తెరుచుకోనుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఓ వైపు సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలని పినరయి విజయన్ ప్రభుత్వం పట్టుదలతో ఉండగా.. మరోవైపు మహిళా భక్తులు, పందళ కుటుంబీకులు దర్శనానికి వెళ్లే మహిళా భక్తులను అడ్డుకుంటున్నారు.
అయ్యప్ప ఆలయానికి వెళ్లే మార్గం వెంబడి వాహనాలను అడ్డుకుంటున్న ఆందోళనకారులు.. మహిళా భక్తులకు ఆలయ పవిత్రతను కాపాడాలని నచ్చచెబుతున్నారు. ఆందోళన సాగిస్తున్న భక్తులు తాము గాంధేయ పద్ధతిలో నిరసనలు తెలియజేస్తున్నామని.. దీనిని ఎవరూ అడ్డుకోలేరని చెబుతుంటే.. ఆలయ దర్శనానికి వచ్చే మహిళలకు భద్రత కల్పిస్తామని స్వయంగా అక్కడి ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. దీంతో కేరళలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.