kcr: డిసెంబర్ లో గడ్డం ఉంచుకునేదెవరో? తీసుకునేదెవరో? తెలిసిపోతుంది: సీఎం కేసీఆర్
- కాంగ్రెస్ నేతలు మాట్లాడే మాటలు వింటుంటే జాలేస్తోంది
- రాహుల్ ని చూసి నేను భయపడతానా?
- గట్స్ లేనోడు.. ధైర్యం లేనోడు ఎన్నికలు తెస్తాడా?
తెలంగాణలో డిసెంబర్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ సమావేశం అనంతరం, మీడియాతో కేసీఆర్ మాట్లాడుతూ, ‘డిసెంబర్ లో గడ్డం గీక్కునేటోడెవడో.. ఉంచుకునేటోడెవడో పరేషాన్ ఉంటుంది కథ అంతా’ అంటూ టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై పరోక్ష వ్యాఖ్యలు సంధించారు. కాంగ్రెస్ నేతలు మాట్లాడే మాటలు వింటుంటే జాలేస్తోందని, రాహుల్ ని చూసి తాను భయపడతానా? అంటూ నవ్వులు చిందించారు.
‘రాహుల్ గాంధీ సభ అనగా నేను బెంబేలెత్తుతానా? ఎన్నికలు తెచ్చిందే నేను కదా? గట్స్ లేనోడు.. ధైర్యం లేనోడు ఎన్నికలు తెస్తాడా? మా కేబినెట్.. మేము ఎన్నికలు తెచ్చాం. మాకు సాహసం లేకపోతే తెస్తామా? అసెంబ్లీ రద్దు చేయడం ద్వారా వచ్చే పరిణామాలను మంచీ చెడులను ఆహ్వానించాం ఎందుకు? అద్భుతంగా ఉన్న అభివృద్ధి ఆగొద్దని. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రగతి చక్రం ఆగొద్దని. పటిష్టమైన సుస్థిరమైన రాజకీయ వ్యవస్థ తెలంగాణకు అవసరం’ అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వంద స్థానాలకు పైగా విజయం సాధించడమే తమ లక్ష్యం తప్ప, గెలుపు ఖాయమని స్పష్టం చేశారు.