amrutha: అమృతకు ప్రణయ్ కాంస్య విగ్రహాన్ని అందజేసిన ప్రేమజంట!
- దళితుడైన శంకర్ ను ప్రేమ వివాహం చేసుకున్న రేష్మారెడ్డి
- ప్రణయ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి, నివాళి అర్పించిన కులాంతర వివాహ జంట
- ప్రణయ్ కుటుంబానికి మద్దతుగా ఉండాలని విన్నపం
తమిళనాడు కృష్ణగిరికి చెందిన కులాంతర వివాహ జంట కేఎస్ శంకర్, రేష్మారెడ్డిలు నిన్న మిర్యాలగూడకు వచ్చారు. పరువుహత్యకు గురైన ప్రణయ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రణయ్ తండ్రిని హత్తుకుని శంకర్ కంటతడి పెట్టారు. అమృత నుంచి ఘటనకు దారి తీసిన కారణాలను తెలుసుకుని ఆవేదనకు గురయ్యారు. ఈ సందర్భంగా తాము ప్రత్యేకంగా తయారు చేయించిన కాంస్య విగ్రహాన్ని ప్రణయ్ కుటుంబసభ్యులకు ఇచ్చారు. ఇంట్లో విగ్రహాన్ని ప్రతిష్ఠించి, పూలమాలలు వేసి, నివాళి అర్పించారు.
అనంతరం శంకర్ మాట్లాడుతూ, అమృతకు భర్తను, బిట్టబోయే బిడ్డకు తండ్రిని దూరం చేసిన వారిని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. సమాజంలోని మానవతావాదులంతా ప్రణయ్ కుటుంబానికి అండగా ఉండాలని కోరారు. పరువు హత్యలు జరగకుండా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని అన్నారు.
రేష్మారెడ్డి మాట్లాడుతూ, కులాంతర వివాహ చట్టాలను రూపొందించాలని డిమాండ్ చేశారు. పరువు హత్యతో మారుతీరావు సాధించింది ఏముందని ప్రశ్నించారు. దళితుడైన శంకర్ ను ప్రేమించి, పెళ్లి చేసుకుని, ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవిస్తున్నానని చెప్పారు. ఈ సందర్భంగా వీరి వెంట మాలమహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి రవి, జోజి, దావీద్, మల్లయ్య, విజయ్ లు ఉన్నారు.