local gunfired: పూలు కోసేందుకు వెళ్లిన వ్యక్తిని బలిగొన్న నాటు తుపాకి
- కృష్ణా జిల్లా కనుమూరు అటవీ ప్రాంతంలో ఘటన
- బాధితుడు ఖమ్మం జిల్లా కొర్లగూడెంకు చెందిన వ్యక్తి
- వన్యప్రాణుల వేటగాళ్ల పనేమోనని అనుమానాలు
వన్యప్రాణుల వేటగాళ్ల గురితప్పిందో, పొరపాటున పేలిందోగాని నాటు తుపాకి నిండుప్రాణాన్ని బలిగొంది. పూలు కోసుకునేందుకు వెళ్లిన నలుగురు వ్యక్తుల్లో ఒకరు తూటా తగిలి కుప్పకూలిపోయారు. కృష్ణా జిల్లా గంపగూడెం కనుమూరు అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఖమ్మం జిల్లా కల్లూరు మండం కొర్ల గూడెంకు చెందిన వ్యక్తి అసువులు బాసాడు.
వివరాల్లోకి వెళితే...కొర్లగూడెంకు చెందిన నలుగురు వ్యక్తులు బతుకమ్మ వేడుకలకు పూలు కోసం కనుమూరు అటవీ ప్రాంతానికి వచ్చారు. పూలు కోసుకునే ప్రయత్నంలో ఉండగా నాటు తుపాకి పేలింది. ఈ ఘటనలో నలుగురిలో ఒకడైన గడ్డం శ్రీనివాసరెడ్డి శరీరం నుంచి తూటా దూసుకుపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
కాగా, దసరా సమీపిస్తున్న నేపథ్యంలో వన్యప్రాణుల కోసం బిజీగా ఉన్న వేటగాళ్లు పొరపాటున జంతువు అనుకుని శ్రీనివాసరెడ్డివైపు కాల్పులు జరిపారా? లేక ప్రమాదవశాత్తు పేలిందా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.