subrahmanian swamy: హిందూ నిరసనకారులపై స్వామి మండిపాటు.. శాస్త్రాలను మార్చాలంటూ వ్యాఖ్య
- శబరిమల ఆలయంలోకి మహిళలు వెళ్లకుండా అడ్డుకోవడం సరికాదు
- సంప్రదాయాల పేరుతో మహిళలను అడ్డుకోవద్దు
- ట్రిపుల్ తలాక్ కూడా ఒక మత సాంప్రదాయమే అనేది గుర్తుంచుకోవాలి
శబరిమల ఆలయంలోకి మహిళలను ప్రవేశించనీయబోమంటూ కేరళలో హిందూ నిరసనకారులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నిరసన కార్యక్రమాలపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి మండిపడ్డారు. 'శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించవచ్చని సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. అయితే ఆలయంలోకి మహిళలు వెళ్లకూడదు, అది సంప్రదాయానికి విరుద్ధం అని మీరు అంటున్నారు. ఆ రకంగా ఆలోచిస్తే ట్రిపుల్ తలాక్ కూడా ఒక మత సంప్రదాయమే. ట్రిపుల్ తలాక్ ను నిషేధించడాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించారు. ఆ సందర్భంగా ఎవరైతే హిందువులు వారి సంతోషాన్ని వెలిబుచ్చారో... ఇప్పుడు వారే రోడ్లపైకి వచ్చి నిరసన చేపట్టారు' అని వ్యాఖ్యానించారు.
శబరిమల ఆలయంలోకి మహిళలను ప్రవేశించకుండా అడ్డుకోవాలనుకోవడం సరైంది కాదని స్వామి అన్నారు. ఇది హిందూ పునరుజ్జీవనానికి, తిరోగమనానికి మధ్య జరుగుతున్న పోరాటమని అభివర్ణించారు. హిందువులంతా ఒకటేనని, కుల వ్యవస్థ రద్దు కావాలని పునరుజ్జీవనం చెబుతుందని అన్నారు. బ్రాహ్మణులు ప్రస్తుతం మేధావులుగానే మిగిలిపోలేదని... వ్యాపారాలు, సినీ పరిశ్రమకు కూడా వారు విస్తరించారని చెప్పారు. పుట్టుక ద్వారానే కులం సంక్రమిస్తుందని ఎక్కడ రాశారని ప్రశ్నించారు. హిందూ శాస్త్రాలను మార్చాల్సిన అవసరం ఉందని చెప్పారు.