Srikakulam District: తిత్లీ బాధితులను కొందరు రెచ్చగొడుతున్నారు.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం!: సీఎం చంద్రబాబు వార్నింగ్
- సాయం చేయకపోయినా ఫరవాలేదు
- వదంతులు వ్యాప్తిచేసి ప్రజల్ని రెచ్చగొట్టొద్దు
- ట్విట్టర్ లో కోరిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
తిత్లీ తుపాను సహాయక చర్యలకు ఆటంకం కలిగించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తెలిపారు. శ్రీకాకుళంలో తిత్లీ తీవ్రతకు నష్టపోయిన ప్రజలకు సాయం చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం అవిశ్రాంతంగా పనిచేస్తోందని సీఎం వెల్లడించారు. అధికారులు ఓవైపు కష్టపడుతుంటే, కొందరు ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చేతనయితే సాయం చేయాలనీ, లేనిపోని వదంతులు వ్యాప్తి చేసి ప్రజలను రెచ్చగొట్టవద్దని హితవు పలికారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు ట్వీట్ చేశారు.
తిత్లీ తుపాను ధాటికి శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో కొబ్బరి, జీడి మామిడి, అరటి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎక్కడికక్కడ విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో చాలా గ్రామాల్లో అంధకారం నెలకొంది. ఈ నేపథ్యంలో అధికారులు, సిబ్బంది విద్యుత్, రోడ్లు సహా పలు మౌలిక వసతులను పునరుద్ధరించేందుకు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నారు.