ramulu naik: నేను ‘కాంగ్రెస్’ నాయకులను కలిశానా?నార్కో టెస్టు చేయించుకుందామా?: రాములు నాయక్ సవాల్
- నాకు ఏ టికెట్టూ అవసరం లేదు
- నాకు కావాల్సింది గిరిజన రిజర్వేషన్లు మాత్రమే
- టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో అబద్ధాల పుట్ట
తాను కాంగ్రెస్ నేతలను కలిశానంటున్నారని, ఎవరు ఎవరితో కలిశారో నార్కో టెస్ట్ చేయించుకుందామా? అంటూ టీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు ఎమ్మెల్సీ రాములు నాయక్. టీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన రాములు నాయక్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, తనకు ఏ టికెట్ అవసరం లేదని, తనకు కావాల్సింది గిరిజన రిజర్వేషన్లు మాత్రమేనని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో గిరిజన రిజర్వేషన్లు కల్పిస్తామని కేసీఆర్ ఇచ్చిన హామీ ఎటుపోయిందని ప్రశ్నించారు.
నారాయణ్ ఖేడ్ లో తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని, భూపాల్ రెడ్డి కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని, ఒకవేళ తాను ఓడిపోతే ఉరేసుకుంటానని సవాల్ విసిరారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోపై ఆయన విమర్శలు చేశారు. ఈ మేనిఫెస్టో అబద్ధాల పుట్ట అని, కొత్త వాగ్దానాలతో ప్రజలను మోసం చేసేందుకు టీఆర్ఎస్ బయలుదేరిందని విమర్శించారు. ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ అని టీఆర్ఎస్ అందని, పార్టీలో కొంతమందికే నిధులు వచ్చాయని, నియామకాలు ఎటుపోయాయో తెలియదని విరుచుకుపడ్డారు.