kcr: కేసీఆర్ సరికొత్త మోసానికి దిగజారారు: కిషన్ రెడ్డి
- ఆచరణ సాధ్యం కాని హామీలతో మభ్యపెడుతున్నారు
- సమస్యలపై టీఆర్ఎస్, కాంగ్రెస్ కు చిత్తశుద్ధిలేదు
- టీఆర్ఎస్ హామీలను శ్రమదానం చేసి అమలు చేస్తారా?
‘పాక్షిక మేనిఫెస్టో’ అంటూ సీఎం కేసీఆర్ సరికొత్త మోసానికి దిగజారారని టీ-బీజేపీ నేత కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎంత వరకు అమలు చేశారో కేసీఆర్ నిన్న చెప్పాల్సిందని, ఇంటింటికీ మిషన్ భగీరథ నీటిని ఇవ్వలేనందునే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని విమర్శించారు.
ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చిన టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బహిరంగ చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు. ఓట్లు, సీట్లు, అధికారం తప్ప ఆ పార్టీలకు సమస్యలపై చిత్తశుద్ధిలేదని విమర్శించారు. తెలంగాణకు ఇచ్చే నిధులను మోదీ ఇంటి నుంచి ఇస్తున్నారా అని కేటీఆర్ విమర్శిస్తున్నారని, మరి, టీఆర్ఎస్ హామీలను శ్రమదానం చేసి అమలు చేస్తారా? అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
2017 నాటికి హైదరాబాద్ నగరంలో లక్ష ఇళ్లు కట్టకపోతే ఓట్టు అడగనని కేసీఆర్ అన్నారని, ఆ మాట ఏమైందని ప్రశ్నించారు. తెలంగాణ విద్యుత్ శాఖ అప్పులమయమైందని, తెలంగాణ ప్రభుత్వం రెండే పనులు పెట్టుకుందని, ఒకటి అప్పులు చేయడం, రెండోది మద్యం అమ్మకాలని విమర్శించారు.