Chandrababu: సిక్కోలులోనే ముఖ్యమంత్రి.. వరద బాధితుల మధ్య దసరా!
- పండుగ రోజూ బాధితుల మధ్యే చంద్రబాబు
- సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న లోకేశ్, మంత్రులు
- పరిస్థితులు హృదయ విదారకంగా ఉన్నాయన్న సీఎం
దసరా పర్వదినాన్ని శ్రీకాకుళంలో తిత్లీ బాధితుల మధ్యే జరుపుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిర్ణయించుకున్నారు. సర్వం కోల్పోయిన వారి మధ్యలో ఉంటూ వారికి ధైర్యం కల్పించడం కోసమే ఆయనీ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం చాలా వరకు మంత్రులు సిక్కోలులోనే ఉండి సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నిర్ణయంతో పండుగకు ఊరెళ్లాలనుకున్న మంత్రులు సైతం జిల్లాలోనే ఉండాలని నిర్ణయించారు.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం పలాసలో ఉండి సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తోంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, ఇతర మంత్రులు పలాసలోనే ఉన్నారు. ఒక్కో మండలానికి ఒక్కో మంత్రి ఇన్చార్జ్గా వ్యవహరిస్తూ సహాయక కార్యక్రమాలను దగ్గరుండి చూసుకుంటున్నారు. చాలా వరకు గ్రామాల్లో విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించారు. మరికొన్ని గ్రామాలకు తాగునీరు, ఆహారం, నిత్యావసర వస్తువుల సరఫరాపై మంత్రులు, అధికారులు దృష్టి సారించారు.
చంద్రబాబు ప్రతీ రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో సమీక్ష నిర్వహిస్తుండగా, మంత్రి లోకేశ్ వారం రోజులుగా అక్కడే బసచేసి సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ జిల్లాలోని చాలా మండలాల్లో పరిస్థితి దారుణంగా, హృదయ విదారకంగా ఉందని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వారిని వదిలి వెళ్లి పండుగ చేసుకోవడం భావ్యం కాదని పేర్కొన్నారు. తాను కుటుంబానికి దూరంగా ఉన్నా ఫర్వాలేదని, ప్రజలు బాగుండడమే తనకు ముఖ్యమని అన్నారు.