China: పాకిస్థాన్ చేతుల్లోకి 'బ్రహ్మోస్'ను మించిన క్షిపణి... విక్రయిస్తున్న చైనా!
- క్షిపణిని అభివృద్ధి చేసిన చైనా మైనింగ్ సంస్థ
- నిర్జన ప్రదేశంలో పరీక్ష
- కొనుగోలు చేసే దేశాల జాబితాలో పాక్
భారత్ - రష్యాలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న సూపర్ సోనిక్ క్షిపణి 'బ్రహ్మోస్'ను మించిన ఖండాంతర క్షిపణి పాకిస్థాన్ అమ్ముల పొదిలో చేరనుంది. ఇప్పటికే ఈ క్షిపణి పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసిన చైనా, వాటిని పాకిస్థాన్ కు విక్రయించేందుకు నిర్ణయించిందని 'గ్లోబల్ టైమ్స్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఏ విధమైన వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇది లక్ష్యాన్ని చేరుతుందని, అధిక శక్తి, వేగ నియంత్రణా వ్యవస్థలు దీని సొంతమని వెల్లడించింది.
ఓ చైనా మైనింగ్ సంస్థ దీన్ని తయారు చేసి సోమవారం నాడు ఉత్తర చైనాలోని నిర్జన ప్రదేశంలో పరీక్షించిందని 'గ్లోబల్ టైమ్స్' పేర్కొంది. వీటిని కొనుగోలు చేయనున్న విదేశాల జాబితాలో పాకిస్థాన్ ఉందని చెప్పింది. ఈ మిసైల్ తాము అనుకున్న విధంగా పనిచేసి లక్ష్యాన్ని ఛేదించినట్టు గువాంగ్ డాంగ్ హోంగ్డా బ్లాస్టింగ్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మిసైల్ తయారీ, రూపకల్పనలో తామే స్వయంగా పెట్టుబడులు పెట్టామని తెలిపింది.
కాగా, దక్షిణ చైనా ముఖ్య పట్టణమైన గువాంగ్ జోలో 1988లో ప్రారంభమైన గువాంగ్ డాంగ్ హోంగ్డా బ్లాస్టింగ్ సంస్థ, సైనిక అవసరాలు, నిర్మాణ రంగం, గనుల విభాగాల్లో అవసరమైన పేలుడు పదార్థాలను తయారు చేస్తోంది.