Dasara: దసరా నేడు కాదంటున్న ప్రజలు... కిక్కిరిసే ఉన్న బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు!
- తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రమే నేడు దసరా
- అసలైన పర్వదినం రేపేనంటున్న ప్రజలు
- నేడు కూడా ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఆర్టీసీ
తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నేడు దసరా సెలవు ఇచ్చాయని, అయితే తాము మాత్రం రేపు దసరా పండగ జరుపుకోనున్నామని పలువురు ప్రజలు అంటున్నారు. గత నాలుగు రోజులుగా పట్టణాల నుంచి స్వస్థలాలకు లక్షలాది మంది చేరుకోగా, నేడు కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ ప్రయాణికులతో కిక్కిరిసి కనిపిస్తున్నాయి.
వీరంతా దసరాను రేపు తమ బంధు మిత్రుల మధ్య చేసుకోనున్నామని చెబుతున్నారు. ఆపై శని, ఆదివారాలు అక్కడే ఉండి తిరిగి వస్తామని అంటున్నారు. ఎన్నో తరాలుగా, సూర్యోదయం ఉన్న తిథినే పర్వదినంగా భావిస్తూ వచ్చామని, ఇప్పుడు రెండు తిథులూ ఒకేరోజు ఉన్నాయని కొత్తగా చెబుతున్నారని ఓ ప్రయాణికుడు వాపోయాడు.
కాగా, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా నేడు కూడా ప్రత్యేక బస్సులను సిద్ధంగా ఉంచామని, హైదరాబాద్ నుంచి వరంగల్, విజయవాడ, కర్నూలు, నిజామాబాద్, కరీంనగర్ ప్రాంతాలకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉందని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. మరోవైపు విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ కూడా వివిధ ప్రాంతాలకు బయలుదేరిన వారితో కిటకిటలాడుతోంది. నిన్న రిజర్వేషన్లు, బస్సులు దొరకని వారు, ఈ ఉదయం నుంచి తమ సొంత ఊర్లకు బయలుదేరుతున్నారు. విజయవాడ నుంచి మాచర్ల, నెల్లూరు, రాజమండ్రి, భీమవరం రూట్లలో అధిక రద్దీ కనిపిస్తోంది.