Congress: నేను ప్రచారానికి వస్తే హిందువుల ఓట్లు పోతాయని భయపడుతున్నారు.. అందుకే నన్ను పిలవడం లేదు!: గులాం నబీ అజాద్
- ఓట్లు పోతాయని వారంతా భయపడుతున్నారు
- బీజేపీ పాలనతో దేశం దిగజారింది
- ఆజాద్ విమర్శలను తిప్పికొట్టిన బీజేపీ
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నేతలు తనను ఎన్నికల ప్రచారానికి పిలవడం లేదని, తాను వస్తే కనుక హిందూ ఓట్లపై ప్రభావం చూపిస్తుందని సంకోచిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ సంచలన ప్రకటన చేశారు. తాను వస్తే ఎక్కడ హిందువుల ఓట్లు వెళ్లిపోతాయోనని వారు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో జరిగిన అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు.
’ఒకప్పుడు నేను దేశమంతా పర్యటించేవాడిని. పలువురు నేతల తర్వాత ప్రచారంలో పాల్గొనేవాడిని. నన్ను ఎన్నికల ప్రచారానికి పిలిచే నేతల్లో 95 శాతం హిందువులు, 5 శాతం ముస్లింలు ఉండేవారు. ఇప్పుడు అలాంటి హిందువుల సంఖ్య 20 శాతానికి పడిపోయింది. వారంతా నా కారణంగా ఎక్కడ హిందువుల ఓట్లు చీలిపోతాయోనని భయపడుతున్నారు. గత నాలుగేళ్లలో ఇలాంటి పరిస్థితి దాపురించింది’ అని వ్యాఖ్యానించారు.
కాగా, హిందువులను కాంగ్రెస్ పార్టీ తప్పుగా చూపిస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర విమర్శించారు. తాను మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ప్రచారం చేస్తే పార్టీకి నష్టమని మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.