pawan kalyan: నోరు హద్దులో పెట్టుకోండి.. మీ గెలుపు వెనక మేమున్నామన్న సంగతి మర్చిపోవద్దు: టీడీపీకి పవన్ కల్యాణ్ హెచ్చరిక
- ప్రతి విమర్శకు భవిష్యత్తులో బాధ్యత వహించాల్సి ఉంటుంది
- విమర్శించే విషయంలో టీడీపీ నేతలు నిగ్రహం పాటించాలి
- కవాతు కోసం పర్యటనను వాయిదా వేసుకోలేదు
జనసేనపై విమర్శలు గుప్పిస్తున్న టీడీపీ నేతలపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. తుపాను బాధిత ప్రాంతాల్లో తాను పర్యటించలేదంటూ టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు అర్థం లేనివని అన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ప్రభుత్వ యంత్రాంగం చేపట్టిందని... తాను వెళ్తే పనులకు ఆటంకం కలుగుతుందని, అందుకే వెళ్ల లేదని చెప్పారు. ధవళేశ్వరం బ్యారేజ్ పై కవాతు కోసం తాను పర్యటనను వాయిదా వేసుకోలేదని అన్నారు. తమను విమర్శించే విషయంలో టీడీపీ నేతలు కొంచెం నిగ్రహం పాటించాలని చెప్పారు. వరుస ట్వీట్లతో పవన్ ఈ మేరకు వ్యాఖ్యానించారు.
జనసేన అనేది ఒక బాధ్యత కలిగిన రాజకీయ పార్టీ అని... తమ పర్యటనలపై విమర్శలు చేయవద్దని టీడీపీ నేతలను కోరుతున్నానని పవన్ అన్నారు. మీ గెలుపు వెనక జనసేన ఉందనే విషయాన్ని మర్చిపోవద్దని చెప్పారు. తమపై చేసే ప్రతి విమర్శకు టీడీపీ నేతలు భవిష్యత్తులో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రతి విషయాన్ని తాము గుర్తుంచుకుంటామని చెప్పారు.
తుపాను సంభవించి ఆరు రోజులు గడిచినా... ఇంకా సగం గ్రామాలు చీకట్లోనే ఉన్నాయని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. 'ముఖ్యమంత్రి గారు... ఈ చీకటి సమయంలో వారి బతుకుల్లో వెలుగు నింపండి' అంటూ ట్వీట్ చేశారు.