Telangana: రేవంత్ రెడ్డి హీరోలా పోజు కొడుతున్నారు.. ఆయన అవినీతి నచ్చే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కట్టబెట్టారు!: బీజేపీ నేత జీవీఎల్
- కేఎస్ఎల్ఆర్ కంపెనీ ఎవరిదో రేవంత్ చెప్పాలి
- అనైతిక, అవినీతి పార్టీగా కాంగ్రెస్ మారింది
- మీడియా సమావేశంలో జీవీఎల్ నిప్పులు
ఆదాయపు పన్ను శాఖ అధికారుల విచారణకు హాజరైన రేవంత్ రెడ్డి బయటకొచ్చి హీరోలా పోజులిచ్చారని బీజేపీ అధికార ప్రతినిధి, పార్లమెంటు సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డిపై ఉందన్నారు. అసలు కేఎస్ఎల్ఆర్ సంస్థ ఎవరిదో రేవంత్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈరోజు హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జీవీఎల్ మాట్లాడారు.
రేవంత్ రెడ్డి వంటి అవినీతి నేతలకు కాంగ్రెస్ పార్టీలో మంచి డిమాండ్ ఉందని జీవీఎల్ ఎద్దేవా చేశారు. ఇలాంటి నేతలతో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కాస్తా ఇమ్మోరల్ నేషనల్ కరప్ట్ కాంగ్రెస్ (అనైతిక, అవినీతి కాంగ్రెస్) పార్టీగా తయారయిందని విమర్శించారు. రేవంత్ రెడ్డి అవినీతి వ్యవహారాలు తెలిసే కాంగ్రెస్ పార్టీ ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాను కట్టబెట్టినట్లు తాము భావిస్తున్నామన్నారు.
కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీలపై నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో భూకబ్జా సహా పలు ఆరోపణలు ఉన్నాయన్నారు. ఈ రోజు తెలంగాణలో పర్యటించనున్న రాహుల్ రేవంత్ రెడ్డిపై యాక్షన్ తీసుకునే బదులు ఆయన దగ్గర క్లాసులు తీసుకునేలా ఉన్నారని జీవీఎల్ ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీ సచ్ఛీలుల పార్టీ అని ప్రజలకు అబద్ధాలు చెప్పినందుకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ చేసిన భారత వ్యతిరేక వ్యాఖ్యలను కాంగ్రెస్ హైకమాండ్ కనీసం ఖండించలేదని మండిపడ్డారు.