railway: రైళ్లలో నేరాల అదుపునకు ‘జీరో ఎఫ్‌ఐఆర్’ పేరుతో ప్రత్యేక యాప్
- ఇప్పటికే ఉన్న సాంకేతిక పరిజ్ఞానానికి ఆధునికత జోడింపు
- వేధింపులు, చోరీలపై తక్షణ ఫిర్యాదుకు అవకాశం
- ఫిర్యాదునే ఎఫ్‌ఐఆర్‌గా పరిగణించనున్న పోలీసులు
రైళ్లలో నేరాల అదుపునకు రైల్వేశాఖ ‘జీరో ఎఫ్‌ఐఆర్’ పేరుతో ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెస్తోంది. గతంలో ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉండగా, దాన్ని మరింత అభివృద్ధిచేసి అమల్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. తోటి ప్రయాణికులు అసభ్యంగా ప్రవర్తించినా, ఇతర ఇబ్బందులకు గురిచేస్తున్నా, చోరీలు జరిగినా, ఇతరత్రా సమస్యలు ఉత్పన్నమయినా ఈ యాప్ ద్వారా తక్షణం ఫిర్యాదు చేయొచ్చు. ఈ ఫిర్యాదునే ఎప్‌ఐఆర్‌గా స్వీకరించి జీఆర్‌పీ/రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తారు.
ఇప్పటికే ఇది పైలట్ ప్రాజెక్టుగా మధ్యప్రదేశ్‌లో అమల్లో ఉంది. దీన్ని మరింత అభివృద్ధిచేసి అందుబాటులోకి తేవాలని రైల్వే శాఖ అధికారులు భావిస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్ నుంచే రోజూ 210 రైళ్లు నడుస్తుండగా, లక్షా 80 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. వీరి నుంచి పలు కారణాలతో పదుల సంఖ్యలో ఫిర్యాదులు జీఆర్‌పీ/ఆర్‌పీఎఫ్ పోలీసులకు అందుతున్నాయి. ఈ యాప్ అందుబాటులోకి వస్తే ఇటువంటి ప్రయాణికులకు ఎంతో ఉపయుక్తమవుతుందని భావిస్తున్నారు.