chattisgargh: కాల్పులతో దద్దరిల్లిన ఛత్తీస్ గఢ్.. ముగ్గురు మావోయిస్టుల కాల్చివేత!
- బీజాపూర్ జిల్లాలో ఘటన
- కూంబింగ్ లో బలగాలపై మావోల కాల్పులు
- దీటుగా తిప్పికొట్టిన బలగాలు
ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈరోజు బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో భద్రతా బలగాలు ముగ్గురు మావోయిస్టులను హతమార్చాయి. జిల్లాలోని మిర్తూర్ అటవీప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఈరోజు ఉదయం కూంబింగ్ నిర్వహించాయి.
బలగాలు మిర్తూర్ అటవీప్రాంతానికి చేరుకోగానే అప్రమత్తమైన మావోలు పోలీసులపై కాల్పులు ప్రారంభించారు. వెంటనే ప్రతిస్పందించిన భద్రతా బలగాలు మావోలపై ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోగా, మిగతావారు అక్కడి నుంచి పరారయ్యారు.
కాగా, ఘటనాస్థలి నుంచి మూడు తుపాకులు, మందుగుండు సామగ్రి, నిషేధిత సాహిత్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాల్పుల్లో తప్పించుకున్న మావోల కోసం గాలింపును తీవ్రతరం చేశారు.