Uttam Kumar Reddy: తొలి ఏడాది లక్ష ఉద్యోగాలతో పాటు.. నిరుద్యోగులకు ప్రతి నెల రూ. 3 వేలు ఇస్తాం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- కేసీఆర్ పాలనలో ఆయన కుటుంబం మాత్రమే బాగుపడింది
- రూ. 500 కోట్లతో గల్ఫ్ బాధితుల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తాం
- గిరిజనులు, దళితులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు
కామారెడ్డిలో నిర్వహించిన కాంగ్రెస్ ప్రజా గర్జన సభలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రసంగిస్తూ... ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పాలనలో ఆయన కుటుంబం మాత్రమే బాగు పడిందని... రాష్ట్ర ప్రజలంతా అనేక ఇబ్బందులకు గురయ్యారని అన్నారు. బీడీ కార్మికుల దుస్థితికి కేసీఆర్, మోదీలే కారణమని దుయ్యబట్టారు. 28 శాతం జీఎస్టీ విధించి కార్మికులకు ఉపాధి లేకుండా చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో ఒక వ్యక్తి లేదా కుటుంబ పాలన ఉండదని... సామాజిక న్యాయం ఉంటుందని చెప్పారు. డబ్బు ప్రభావంతో ఎన్నికల్లో గెలిచేందుకు టీఆర్ఎస్ యత్నిస్తోందని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని చెప్పారు. కామారెడ్డి సభలో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు హామీలను గుప్పించారు. అవేంటో చూద్దాం.
- నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తాం
- రూ. 500 కోట్లతో గల్ఫ్ బాధితుల కోసం సంక్షేమ నిధి
- తొలి ఏడాదిలోనే లక్ష ఉద్యోగాల కల్పన
- నిరుద్యోగులకు నెలకు రూ. 3 వేల చొప్పున నిరుద్యోగ భృతి
- రైతాంగానికి రూ. 2 లక్షల రుణమాఫీ
- కుటుంబంలో ప్రతి మనిషికి 7 కిలోల సన్నబియ్యం, తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులు
- దళితులు, గిరిజనులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు
- రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాం