Telangana: తెలంగాణలో చిన్న నోట్లకు యమ గిరాకీ... రూ. 2000 మార్చాలంటే రూ. 100 కమీషన్!
- ఎన్నికలు దగ్గరపడుతుంటే చిల్లర సమస్య
- రూ. 500, రూ. 200 కావాలంటున్న నేతలు
- బ్యాంకు లావాదేవీలపై అధికారుల కన్ను
- పక్క రాష్ట్రాలను ఆశ్రయిస్తున్న రాజకీయ నాయకులు
అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణలో చిల్లర సమస్య నెలకొంది. ఎన్నికల్లో ఖర్చు కోసం చిన్న నోట్లను నేతలు కోరుకుంటూ ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఫలితంగా రూ. 500, రూ. 200 నోట్లకు గిరాకీ పెరుగగా, రూ. 2 వేల నోటును మార్చి ఇస్తే, 2 నుంచి 5 శాతం వరకూ కమీషన్ ఇస్తామని పలువురు ఆఫర్ చేస్తున్న పరిస్థితి. రాష్ట్రంలోని బ్యాంకు ట్రాన్సాక్షన్స్ పై ఐటీ, ఈసీ అధికారులు కన్నేయడంతో, నోట్లను మార్చుకునేందుకు పక్క రాష్ట్రాలకు వెళుతున్నారు తెలంగాణ నేతలు.
రాష్ట్రంలో ఇప్పటివరకూ సుమారు 10 కోట్ల రూపాయలకు పైగా పట్టుబడగా, వీటిల్లో రూ. 500 నోట్లే అత్యధికంగా ఉండటంతో నోట్ల మార్పిడి జరుగుతుందన్న విషయం స్పష్టమవుతోందని అధికారులు అంటున్నారు. ఇక పెట్రోలు బంకులు, వైన్స్ షాపుల్లో రూ. 2000 నోట్లు అధికంగా చేతులు మారుతున్నాయి. అక్కడ కూడా చిల్లర సమస్య ఏర్పడుతోంది. దీంతో కొంత మొత్తాన్ని తగ్గించుకుని చిల్లర తీసుకునేందుకూ పలువురు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.
ఇక బ్యాంకుల్లో రూ. 2 లక్షలు మించి విత్ డ్రా చేసినా, రూ. 5 లక్షలు మించి లావాదేవీ జరిపినా వారి వివరాలను ఐటీ, ఆర్బీఐ సేకరిస్తున్నాయి. రాష్ట్రంలోని పలు పార్టీల నాయకులు చిన్న నోట్లు కావాలంటూ, ఏపీలోని తమ బ్యాంకు కార్యాలయాలను సంప్రదిస్తున్నాయని కొన్ని ప్రైవేటు బ్యాంకుల అధికారులు అంటున్నారు.