Vizag Prasad: ప్రముఖ సినీ నటుడు వైజాగ్ ప్రసాద్ కన్నుమూత!

  • ఆదివారం తెల్లవారుజామున మరణం
  • అకస్మాత్తుగా వచ్చిన గుండెపోటు
  • పలు చిత్రాల్లో నటించి, మెప్పించిన వైజాగ్ ప్రసాద్

ప్రముఖ క్యారెక్టర్ నటుడు వైజాగ్ ప్రసాద్ నేటి తెల్లవారుజామున 3 గంటల సమయంలో మరణించారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. ఆయనకు భార్య విద్యావతి, ఇద్దరు పిల్లలు రత్నప్రభ, రత్నకుమార్ ఉన్నారు. గత రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, అకస్మాత్తుగా వచ్చిన గుండెపోటుతో మరణించినట్టు తెలుస్తోంది. వైజాగ్ ప్రసాద్ అసలు పేరు కొర్లాం పార్వతీ వరప్రసాదరావు. వైజాగ్ లోని గోపాలపట్నం ఆయన స్వగ్రామం.

కొన్ని వందల చిత్రాల్లో నటించిన ఆయన, టీవీ సీరియల్స్ లోనూ పలు కీలకమైన పాత్రలు పోషించి తెలుగు అభిమానులకు వినోదాన్ని అందించారు.  రంగస్థలం నుంచి వెండితెరకు వచ్చిన వైజాగ్ ప్రసాద్, తేజ దర్శకత్వంలో వచ్చిన 'నువ్వు నేను'లో హీరో ఉదయ్ కిరణ్ తండ్రి పాత్రను పోషించి, మెప్పించిన తరువాత, వరుసగా అవకాశాలను పొందారు. భద్ర, జై చిరంజీవ, గౌరి, జానకీ వెడ్స్ శ్రీరామ్ తదితర చిత్రాల్లో నటనతో గుర్తింపు పొందారు.

కాగా, రత్నప్రభ అమెరికాలో, రత్నకుమార్ లండన్ లో నివాసం ఉంటుండగా, వారికి కబురు చేశామని, వారు వచ్చిన తరువాత అంత్యక్రియలు జరుగుతాయని ప్రసాద్ కుటుంబీకులు తెలిపారు. వైజాగ్ ప్రసాద్ మృతికి టాలీవుడ్ సంతాపం వెలిబుచ్చింది.

  • Loading...

More Telugu News