rail accident: రైలు ప్రమాదం జరిగిన చోట చోరుల చేతివాటం!
- విలువైన సెల్పోన్లు, బంగారు వస్తువులు అపహరణ
- బాధితుల గగ్గోలు పట్టించుకోకుండా తమదైన శైలిలో దోపిడీ
- సాయం అందించడం మరిచి సెల్ఫీలు దిగిన మరికొందరు
మానవత్వానికి మాయని మచ్చ ఇది...మరణ మృదంగం మోగిన చోట వ్యక్తిగత లాభం కోసం పాకులాడే జనం ఉంటారని నిరూపించే ఘటన ఇది. ఓ వైపు బాధితులు సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తుంటే మరోవైపు కొందరు చేతివాటం ప్రదర్శించి విలువైన వస్తువులు దోచుకుపోయారంటే ‘మానవత్వమా...నీ చిరునామా ఎక్కడ?’ అని అనకుండా ఉండలేం.
పంజాబ్ రాష్ట్రం అమృతసర్ పట్టణంలోని జోడాపాటక్ వద్ద దసరా ఉత్సవాల్లో మునిగి ఉన్న జనం మీదుగా రైలు దూసుకువెళ్లిన దుర్ఘటన నేపథ్యంలో కొందరు బాధితులకు ఎదురైన అనుభవాలు ఇవి.
దీపక్ అనే వ్యక్తి కూతురు, కొడుకుతో కలిసి ఉత్సవాలు తిలకిస్తున్నారు. ఈ సమయంలో రైలు దూసుకురావడంతో కూతురు దుర్మరణం పాలవ్వగా, అతని రెండు కాళ్లు తెగిపడ్డాయి. కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. చనిపోయిన కూతురు, ఒళ్లంతా గాయాలైన కొడుకును చూసి దీపక్ కుమిలిపోతున్న సమయంలో వచ్చిన వ్యక్తి గొంతులో ఇన్ని మంచినీళ్లు పోసి దాహం తీరుస్తాడని ఆశిస్తే అతని జేబులోని సెల్ఫోన్ బలవంతంగా లాక్కుని పారిపోయాడు.
జ్యోతి కుమారి 17 ఏళ్ల కొడుకు రావణ దహనం ఉత్సవాన్ని చూసేందుకు వెళ్లాడు. దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. ఆస్పత్రిలో కొడుకు మృతదేహం చూసి కుప్పకూలిపోయిన జ్యోతి కుమారికి కాసేపటికిగాని అర్థం కాలేదు. తన కొడుకు మెడలో ఉన్న బంగారం గొలుసు లేదని. అంతేకాదు అతని సెల్ఫోన్, పర్సు కూడా కనిపించక పోవడంతో ఆమె హతాశురాలైంది.
స్నేహితులతో కలిసి ఉత్సవాన్ని చూసేందుకు వెళ్తున్నానని కొడుకు చెప్పడంతో కమల్ కుమార్ సరే అన్నాడు. తీరా వెళ్లిన కొడుకు విగత జీవిగా మారాడని తెలియడంతో కుప్పకూలిపోయాడు. కొడుకు మృతదేహాన్ని ఆస్పత్రివారు అప్పగించాకగాని కమల్కుమార్కు తెలియలేదు, అతని వద్ద ఉన్న ఖరీదైన సెల్ఫోన్ మాయమయ్యిందన్న విషయం.
కొన్ని మీడియా సంస్థలు తమ పుటేజీని గమనించగా, ప్రమాదం అనంతరం బాధితులకు తక్షణ సాయం అందించాల్సింది పోయి కొందరు చేతివాటం ప్రదర్శించినట్లు గుర్తించారు. విలువైన సెల్ఫోన్లు, బంగారం, డబ్బు ఎత్తుకు వెళ్లారని గమనించారు. దీంతో ఆశ్చర్య పోవడం వారి వంతయింది. విషాదంలో సాయం అందించడం మరిచి మరికొందరు సెల్ఫీలు దిగడం విశేషం.
‘ఇంత విషాదంలోను అక్కడ ఉన్న వ్యక్తులు ఇంత అమానవీయంగా ఎలా ప్రవర్తించగలిగారో అర్థం కావడం లేదు’ అంటూ జమ్ము-కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.