Drunk Driving: మద్యం మత్తులో యువతుల హల్చల్.. పోలీసులకు చుక్కలు!
- తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన యువతులు
- ఆల్కహాల్ టెస్టుకు ససేమిరా
- వాహనాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో మద్యం మత్తులో ఉన్న యువతులు ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపించారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారు ఆల్కహాల్ టెస్టు చేయించుకునేందుకు ససేమిరా అన్నారు. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు అంగీకరించలేదు. వారితో వాగ్వాదానికి దిగి నానా రభస చేశారు. చివరికి విసిగిపోయిన పోలీసులు కేసులు నమోదు చేసి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో శనివారం రాత్రి నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్లో మొత్తం 112 కేసులు నమోదైనట్టు పోలీసులు తెలిపారు. ఇందులో 65 బైక్లు, 5 ఆటోలు, 42 ఫోర్ వీలర్ల వాహనాదారులు ఉన్నారు. డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన ఇద్దరు యువతులు పరీక్షలకు సహకరించలేదని, విధుల్లో ఉన్న పోలీసులతో వాగ్వాదానికి దిగారని వివరించారు. ఎట్టకేలకు ఓ మహిళా కానిస్టేబుల్ సాయంతో వారికి ఆల్కహాల్ టెస్టు నిర్వహించగా మద్యం తాగినట్టు తేలిందని, దీంతో వాహనాలు స్వాధీనం చేసుకుని, కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.