sexual herasment: కట్టుకున్న వారే రుణదాతలకు తాకట్టు పెట్టాలనుకున్నారు: ముంబైలో దారుణం

  • రుణ దాత కోరిక తీర్చాలంటూ ఒత్తిడి చేసిన ఓ భర్త
  • బంధువు తన కళ్లెదుటే భార్యను లైంగికంగా వేధిస్తున్నా పట్టని మరో వ్యక్తి
  • న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించిన బాధిత మహిళలు

కన్యాదానం సమయంలో ‘నాతిచరామి’ అని ఆత్మసాక్షిగా ప్రమాణం చేసి జీవితాంతం తోడూ, నీడ, రక్షణగా ఉంటానని మూడు ముళ్లు వేసిన భర్తే విటుడి వద్దకు వెళ్లాలని ఒత్తిడి చేస్తే ఆ ఇల్లాలు ఎవరికి చెప్పుకుంటుంది? అందుకే సంప్రదాయ సంకెళ్లు తెంచుకుని ఆమె పోలీస్‌ స్టేషన్‌ మెట్లెక్కింది. తన మానాన్ని కాపాడుకుంది. ఆమె తీరుతో స్ఫూర్తి పొందిన సోదరి కూడా తనకు జరుగుతున్న అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వివరాల్లోకి వెళితే...ముంబై నగరం విరార్‌ ప్రాంతంలోని ఎంబీ ఎస్టేట్‌కు చెందిన ఇద్దరు సోదరులు ఇద్దరు అక్కాచెల్లెళ్లను పెళ్లాడారు. తొలి నుంచి భర్త, అత్తమామల ప్రవర్తన వారికి ఆశ్చర్యం కలిగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో అక్కాచెల్లెళ్లలోని ఒకామె భర్త లక్షన్నర అప్పు చేశాడు. రుణ దాత నుంచి ఒత్తిడి పెరిగిందో లేక భార్యపై వారి కన్నుపడిందోగాని డబ్బు కోసం వేరే మార్గంలో ఒత్తిడి చేయడం మొదలు పెట్టారు. వారి ఒత్తిడికి లొంగిన భర్త రుణదాత కోరిక తీర్చాలంటూ భార్యను పురమాయించాడు. భర్త నోటి నుంచి వచ్చిన ఈ మాటలు వినగానే ఆమె కాసేపు ఆశ్చర్యపోయింది. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఈ 24 ఏళ్ల వివాహిత పోలీసులను ఆశ్రయించింది. భర్త తీరుపై ఫిర్యాదు చేసింది.

దీంతో ఆమె సోదరి (22) కూడా స్ఫూర్తి పొందింది. గత కొన్నాళ్లుగా భర్త, అత్తమామల ఎదుటే ఓ బంధువు తనను లైంగికంగా వేధిస్తున్నా వారు చూసీ చూడనట్లు ఉంటున్నారని, దీంతో తాను తీవ్ర మానసిక వేదన అనుభవిస్తున్నానంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ‘మేము చెప్పిన వారి వద్దకు వెళ్లి వారి కోరిక తీర్చండి...లేదా మీ పుట్టింటికి వెళ్లి రూ.5 లక్షలు తీసుకురండి’ అంటూ తమ భర్తలు తమను బెదిరిస్తున్నారని ఈ మహిళలు తమ ఫిర్యాదుల్లో  పేర్కొన్నారు. వీరి ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News