Dasara: అంతిమ సంస్కారం ఒకసారే.. రావణ దహనాన్ని నిషేధించండి: శంకరాచార్య అధోక్షజానంద దేవ్ తీర్థ మహరాజ్
- హిందూ మత సంప్రదాయాన్ని అనుసరించాలి
- విభీషణుడు ఎప్పుడో ఆ పనిచేశాడు
- మళ్లీ మళ్లీ చేయాల్సిన పనిలేదు
పంజాబ్లో నిర్వహించిన రావణ దహన కార్యక్రమం విషాదంగా మారిన నేపథ్యంలో రావణ దహనం కార్యక్రమం మరోమారు వివాదాస్పదమైంది. అసలు దసరా రోజున రావణ దహనం తప్పనిసరిగా నిర్వహించాల్సిందేనా? అన్నదానిపై ఇప్పటికే చర్చోపచర్చలు మొదలయ్యాయి. తాజాగా రావణ దహనంపై శంకరాచార్య అధోక్షజానంద దేవ్ తీర్థ మహరాజ్ రాష్ట్రపతికి రాసిన లేఖలో పలు కీలక విషయాలను ప్రస్తావించారు.
దసరా రోజున రావణుడి దిష్టిబొమ్మను దహనం చేస్తే సంప్రదాయానికి చరమగీతం పాడాలని అందులో పేర్కొన్నారు. రావణ దహనాన్ని నిషేధించాలని కోరారు. హిందూ మత ధర్మం ప్రకారం అంతిమ సంస్కారం ఒక్కసారే జరుగుతుందని పేర్కొన్నారు. రావణుడి అంతిమ సంస్కారాలను రాముడి సమక్షంలో విభీషణుడు నిర్వహించేశాడని, కాబట్టి మళ్లీ మళ్లీ ఆ అవసరం లేదన్నారు. అంతేకాక, దిష్టిబొమ్మ దహనం వల్ల కాలుష్యం విపరీతంగా పెరిగే అవకాశం ఉందన్నారు. పంజాబ్లోని అమృత్సర్లో జరిగిన రైలు దుర్ఘటనల వంటివి కూడా జరిగే అవకాశం ఉందని, కాబట్టి రావణ దహనాన్ని నిషేధించాలని అధోక్షజానంద డిమాండ్ చేశారు.