Hyderabad metro rail: హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం.. మహిళల సీట్లలో కూర్చుంటే జరిమానా వడ్డన!
- దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ల సీట్లకు వర్తింపు
- నిర్ణయం తీసుకున్న మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
- మహిళల ఫిర్యాదుకు ప్రత్యేకంగా వాట్సాప్ నంబర్
హైదరాబాద్ మెట్రో ప్రయాణం మరింత సుఖవంతం అయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా మహిళలు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల సీట్లలో ఇతరులెవరైనా కూర్చుంటే రూ.500 జరిమానా విధించనున్నారు. రైలులో ప్రతి కంపార్ట్ మెంట్ లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.
మెట్రో రైలులో ఎదురయ్యే ఇబ్బందులను తెలియజేసేందుకు వీలుగా మహిళా ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా ఓ వాట్సాప్ నంబర్ ను కేటాయించాలని ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అధికారులకు సూచించారు. మెట్రో పరిసరాల్లో ఆక్రమణలు చేపట్టినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందుకోసం ముగ్గురు అధికారులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను నియమించామన్నారు. ఎల్ బీ నగర్-మియాపూర్, నాగోల్-అమీర్ పేట మార్గాల్లో మెట్రో స్టేషన్లలో మిగిలిన నిర్మాణ పనులను శరవేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు.