Congress: అంతా కాంగ్రెస్ ఇష్టమే... మాదేమీ లేదు: కోదండరామ్ కీలక వ్యాఖ్యలు
- కూటమిని కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ దే
- పట్టుదలను ప్రదర్శిస్తే మేమేమీ చేయలేము
- కూటమి విఫలమైతే అత్యధిక స్థానాల్లో పోటీ: కోదండరామ్
తెలంగాణలో ఏర్పడిన మహాకూటమిని కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని, ఈ విషయంలో ఆ పార్టీ పట్టుదలను ప్రదర్శిస్తే తాము చేయగలిగింది ఏమీ లేదని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధినేత కోదండరామ్ వ్యాఖ్యానించారు. పొత్తులు ఇంతవరకూ తేల్చకపోవడాన్ని తప్పుబట్టిన ఆయన, మిగతా పార్టీలు సైతం కాంగ్రెస్ పై ఆగ్రహంతో ఉన్నాయని అన్నారు. ఈ ఉదయం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, తాము ఎంతగా అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ స్పష్టతను ఇవ్వడం లేదని ఆరోపించారు.
ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ, తమలో సహనం నశిస్తోందని, నేడు కాంగ్రెస్ స్పందించకుంటే, ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించుకోవడం మినహా తమ ముందు మరో మార్గం లేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో తాము చేయగలిగింది కూడా ఏమీ లేదని వ్యాఖ్యానించారు. మహాకూటమి విచ్ఛినమైతే, తమతో కలసి నడిచేందుకు సీపీఐ సిద్ధంగా ఉంటుందని భావిస్తున్నట్టు తెలిపారు. పొత్తు కుదరకుంటే సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లలో పోటీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కోదండరామ్ వ్యాఖ్యానించారు.