Bridge: ప్రపంచంలోనే అత్యంత పొడవైన సముద్ర బ్రిడ్జ్ ను ప్రారంభించిన చైనా అధ్యక్షుడు
- హాంకాంగ్, మకావూ, చైనా భూభాగాలను కలపనున్న బ్రిడ్జ్
- బ్రిడ్జ్ పొడవు 55 కిలోమీటర్లు
- బ్రిడ్జ్ నిర్మాణంపై వ్యక్తమవుతున్న భిన్నాభిప్రాయాలు
ప్రపంచంలోనే అత్యంత పొడవైన సముద్ర బ్రిడ్జ్ ను చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఈరోజు ప్రారంభించారు. 55 కిలోమీటర్ల పొడవున్న ఈ బ్రిడ్జ్ హాంకాంగ్, మకావూతోపాటు చైనా ప్రధాన భూభాగాన్ని కలుపుతుంది. జుహాయ్లో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న జిన్ పింగ్ ఈ ఉదయం ఈ బ్రిడ్జ్ ను ప్రారంభించారు. ఈ బ్రిడ్జ్ మొత్తం పొడవు 55 కిలోమీటర్లు. రోడ్డు బ్రిడ్జ్ తో పాటు నీటిలో సొరంగం ద్వారా నిర్మితమైన ఈ బ్రిడ్జ్ ఇస్తూరీ నదిని దాటుతూ హాంకాంగ్ లాంతావ్ ద్వీపం, జుహాయ్, మకావూలను కలపనుంది. గత నెలలో చైనా, హాంకాంగ్ లకు కలిపే హైస్పీడ్ రైల్వే మార్గాన్ని కూడా చైనా ప్రారంభించింది. అనంతరం ఈ భారీ బ్రిడ్జ్ ను ప్రారంభించడం గమనార్హం.
అయితే హాంకాంగ్ తో చైనా తన రవాణా మార్గాలను మెరుగుపరచుకోవడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హాంకాంగ్ లో తన బలగాలను మోహరించేందుకు చైనా ఈ బ్రిడ్జ్ ను నిర్మించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. బ్రిడ్జ్ పై ప్రయాణించడానికి పలు ఆంక్షలు ఉన్నాయని అంటున్నారు. ఇదిలావుండగా బ్రిడ్జ్ నిర్మాణంతో రవాణా, వాణిజ్య కార్యాకలాపాలు అనుకూలంగా ఉంటాయని పలువురు సమర్థిస్తున్నారు.