Casting Couch: వైరముత్తు వేధింపుల వల్లే సింగింగ్ వృత్తి నుంచి తప్పుకున్నా.. అతనికి మాత్రం లొంగలేదు!: గాయని భువన శేషన్
- బయటపెట్టిన సింగర్ భువన శేషన్
- మలేసియా ప్రైవేటు ట్రిప్ కు రావాలని ఒత్తిడి
- చెప్పినట్లే కెరీర్ నాశనం చేశాడని ఆవేదన
పలువురు మహిళా సింగర్లను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ తమిళ గీత రచయిత వైరముత్తు మరో వివాదంలో చిక్కుకున్నారు. దాదాపు 20 ఏళ్ల క్రితం వైరముత్తు తనను లైంగికంగా వేధించాడని గాయని భువన శేషన్ బయటపెట్టింది. ఆయనకు లొంగకపోవడంతో తన కెరీర్ ను నాశనం చేశాడని వెల్లడించింది. దీంతో ఈ రంగంలో ఉండటం కంటే తప్పుకోవడమే మేలని భావించి నిష్క్రమించానని పేర్కొంది. తనతో వైరముత్తు ప్రవర్తించిన విధానాన్ని భువన సోషల్ మీడియా ద్వారా బయటపెట్టింది. ఇన్నాళ్లూ ఈ బాధను గుండెల్లోనే దాచుకున్నాననీ, మీ టూ ఉద్యమం నేపథ్యంలో ఇప్పుడు బయటపెడుతున్నానని తెలిపింది.
‘‘చెన్నైలోని రంగరాజపురంలో ఉన్న జాయ్ స్టూడియోలో ఓ ప్రాజెక్టుకు సంబంధించి పాటల రికార్డింగ్ జరుగుతోంది. ఈ ప్రాజెక్టుకు పాటల రచయితగా, నిర్మాతగా వైరముత్తు వ్యవహరించాడు. ఈ సందర్భంగా నా గొంతు చాలా బాగుందనీ, తమిళంపై నాకు మంచి పట్టుందని కితాబిచ్చాడు. అనంతరం నా ఫోన్ నంబర్ తీసుకున్నాడు. ఓరోజు పాటకు సంబంధించి డెమో ఇచ్చేందుకు ఇంటికి రావాలని కోరాడు. నేను వెళ్లి డెమో ఇచ్చాను. ఈ సందర్భంగా ఇళయరాజా, శివాజీ గణేశన్, సహా పలువురు సినీ ప్రముఖుల గురించి చర్చించాం. అప్పటివరకూ అన్నీ బాగానే సాగాయి.
ఓరోజు వైరముత్తు నాకు ఫోన్ చేశాడు. ‘నీ గొంతు మాత్రమే కాదు. నువ్వు కూడా చాలా తెలివైన, అందమైన దానివి. అందమైన, తెలివైన అమ్మాయి కోసం కొనసాగుతున్న నా గాలింపు నీతో ముగుస్తుందా? అని ప్రశ్నించాడు. నీ చూపులు చురకత్తుల్లా నన్ను గుచ్చుకుంటున్నాయ్’ అంటూ చెత్త కవిత్వం కూడా చెప్పాడు. అయితే నాకు ఇలాంటివి నచ్చవని స్పష్టం చేసి ఫోన్ పెట్టేశాను. మరుసటి రోజు ఫోన్ చేసి ‘నేను మలేసియా పోతున్నా.. వస్తావా?’ అని అడిగాడు. పాడటానికా? యాంకరింగ్ చేయడానికా? అని ప్రశ్నించా. దీనికి అతను వెంటనే ‘రెండూ కాదు. నువ్వేమన్నా చిన్నపిల్లవా? అంతమాత్రం అర్థం చేసుకోలేవా? నాతో వచ్చావంటే నీ లైఫ్ సెటిల్ అయిపోద్ది’ అని బెదిరింపు ధోరణిలో మాట్లాడాడు.
నేను రాననీ, ఇంకోసారి నాకు ఫోన్ చేయొద్దని స్పష్టం చేశాను. నాకు ఇలాంటివి నచ్చవని కరాఖండిగా చెప్పేశాను. దీంతో తన మాట వినకుంటే సినీ పరిశ్రమలో అవకాశాలు లేకుండా కెరీర్ ను నాశనం చేస్తానని హెచ్చరించాడు. అతను అన్నట్లే జరిగింది. ఈ ఘటన జరిగిన వెంటనే నా మూడు విదేశీ ట్రిప్పులు క్యాన్సిల్ అయ్యాయి. ఇదేంటని ప్రశ్నిస్తే.. ‘మేడమ్.. పైస్థాయి నుంచి చాలా ఒత్తిడి ఉంది’ అని జవాబు వచ్చేది. ఇంతలా దిగజారి పనిచేసే కంటే తప్పుకోవడం మేలని కోలీవుడ్ నుంచి నిష్క్రమించాను’’ అని భువన శేషన్ బయటపెట్టింది.