modi: నేడు ఐటీ నిపుణులతో సమావేశమవనున్న ప్రధాని మోదీ
- పాల్గొననున్న 1000 మంది ఐటీ నిపుణులు
- దేశంలో పెరుగుతున్న డిజిటల్ వినియోగంపై చర్చ
- సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణ పెరగాలని కోరనున్న ప్రధాని
దేశంలోని పలు ఐటీ విభాగాల్లో పనిచేస్తున్న సమాచార మరియు సాంకేతిక నిపుణులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమవనున్నారు. నేడు జరగనున్న ఈ సమావేశంలో ఐటీ విభాగాల్లో పనిచేస్తున్న నిపుణులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. దేశంలో పెరుగుతున్న డిజిటల్ వినియోగం, ఐటీ రంగంతో సామాజిక జీవనం ముడిపడడం, ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీకి సంబంధించిన సమస్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
ఐటీ రంగాన్ని మరింత ఉపయోగకరంగా మార్చుకునే విధానాలను నిపుణులు ప్రధానికి వివరించనున్నారు. ప్రధానితో సమావేశం నేపథ్యంలో ఈ నెల మొదటివారంలో ఐటీ సంస్థల అధినేతలతో కేంద్ర ఐటీ శాఖా మంత్రి రవి శంకర్ ప్రసాద్ కూడా సమావేశమయ్యారు. సామాజిక ఆవిష్కరణల దిశగా కంపెనీలు ముందడుగు వేయాలని ఆయన కోరారు.
నేడు దాదాపు 1000 మంది ఐటీ నిపుణులతో ప్రధాని మోదీ సమావేశమవనున్నారని, దాదాపు 12 ప్రాంతాల్లోని ఔత్సాహిక సీఈవో, ఐటీ నిపుణులతో మాట్లాడనున్నారని, భారతీయ సమాజంలో అంతర్భాగమవుతున్న డిజిటల్ వినియోగంపై వారిని ప్రోత్సహించనున్నారని మంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియాకు తెలిపారు. ఈ సమావేశంలో ‘సెల్ఫ్4సొసైటీ’ని ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారని చెప్పారు.