CBI: మాల్యా పారిపోయేందుకు సహకరించిన సీబీఐ అధికారులు... కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకున్న నాగేశ్వరరావు!
- మాల్యా పారిపోవడానికి ఒకరోజు ముందు లుకౌట్ నోటీసుల డీగ్రేడ్
- సీబీఐ ఉత్తర్వుల కాపీని స్వాధీనం చేసుకున్న నాగేశ్వరరావు
- సోదాల్లో కంటబడిన పలు కీలక పత్రాలు!
సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ గా చార్జ్ తీసుకుంటూనే కేంద్ర కార్యాలయంలోని మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ, అదనపు డైరెక్టర్ ఏకే శర్మల గదుల్లో తనిఖీలు చేపట్టిన నాగేశ్వరరావు కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి, విదేశాలకు పారిపోయిన యూబీ గ్రూప్ మాజీ చైర్మన్ విజయ్ మాల్యాకు కొందరు అధికారులు సహకరించారనడానికి పక్కా ఆధారాలు వీరి చాంబర్లలో లభించినట్టు వార్తలు వెలువడుతున్నాయి.
ఈ విషయంలో అధికారికంగా ప్రకటన వెలువడకున్నా, మాల్యా పలాయనానికి ఒక్క రోజు ముందు ఆయనపై ఉన్న లుకౌట్ నోటీస్ ను డీగ్రేడ్ చేస్తూ సీబీఐ వెలువరించిన ఉత్తర్వుల కాపీని ఆయన స్వాధీనం చేసుకున్నారని సమాచారం. మాల్యా పారిపోవడానికి నిర్ణయించుకున్న తరువాత తన పరపతితో లుకౌట్ నోటీసుల తొలగింపునకు ప్రయత్నించగా, అందుకు సహకరించిన కొందరు సీబీఐ అధికారులపై ఆస్థానా విచారణ జరిపిన సంగతి తెలిసిందే. ఆస్థానా చేసిన విచారణలో వెల్లడైన నిజాలకు సంబంధించిన కీలక పత్రాలు కూడా ఈ తనిఖీల్లో నాగేశ్వరరావు కంట బడినట్టు తెలుస్తోంది. సీబీఐ కేంద్ర కార్యాలయంలో తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి.