CBI: సీబీఐ కేంద్ర కార్యాలయంలో ముగ్గురి చాంబర్లను సీజ్ చేయించిన నాగేశ్వరరావు!
- గత అర్ధరాత్రి 2 గంటల తరువాత బాధ్యతలు
- తరువాత గంటల వ్యవధిలోనే సోదాలు
- సీబీఐ కార్యాలయంలో 10, 11 అంతస్తుల్లో సోదాలు
నిన్న జరిగిన అనూహ్య పరిణామాల మధ్య, గత అర్ధరాత్రి 2 గంటల తరువాత సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన మన్నెం నాగేశ్వరరావు, ఈ ఉదయం కేంద్ర కార్యాలయంలో తనిఖీల తరువాత మూడు చాంబర్లను సీజ్ చేయించారు. ఈ తెల్లవారుజాము నుంచి సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానా, సస్పెన్షన్ కు గురైన దేవేందర్ కార్యాలయాలు ఉన్న 10, 11 అంతస్తుల్లో తనిఖీలు చేపట్టిన నాగేశ్వరరావు బృందం వారి చాంబర్లను సీజ్ చేసింది.
అధీకృత ధ్రువీకరణ పత్రాలు, గుర్తింపు కార్డులు ఉన్నావారు తప్ప, మిగతా వారు ఎవరూ సీబీఐ ఆఫీసులోనికి రాకుండా బందోబస్తును ఏర్పాటు చేయించిన నాగేశ్వరరావు, దగ్గరుండి తనిఖీలను జరిపించారు. బాధ్యతలు చేపట్టిన గంటల వ్యవధిలో తనిఖీలు చేపట్టిన ఆయన, పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. అధికారులు వాడిన ఎలక్ట్రానిక్ పరికరాలు, కంప్యూటర్లను నాగేశ్వరరావు టీమ్ తమ అధీనంలోకి తీసుకుని, వాటిల్లో ఉన్న సమాచారాన్ని క్రోఢీకరించే పనిలో నిమగ్నమైంది.