Andhra Pradesh: ఆంధ్రుల రాజధానికి పైసా విదల్చలేదు.. కానీ ఉత్తరాదిన విగ్రహాలకు వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు!: మంత్రి నక్కా
- బీజేపీ నేతలు ఏపీపై విషం చిమ్ముతున్నారు
- పంచాయితీ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం
- దమ్ముంటే వైసీపీ-బీజేపీ కలిసి మాపై పోటీచేయాలి
బీజేపీ జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు ఆంధ్రప్రదేశ్ పై విషం చిమ్ముతున్నారని మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ సీటులో కూడా డిపాజిట్ రాదని జోస్యం చెప్పారు. ఐదున్నర కోట్ల మంది ఆంధ్రుల రాజధాని అమరావతికి పైసా విదల్చని కేంద్రం.. ఉత్తరాదిన విగ్రహాలకు మాత్రం వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందని మండిపడ్డారు. అమరావతిలో ఈరోజు పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆనందబాబు మాట్లాడారు.
హైకోర్టు ఆదేశాల మేరకు పంచాయితీ ఎన్నికలు నిర్వహిస్తామనీ, అందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆనందబాబు అన్నారు. దమ్ముంటే వైసీపీ-బీజేపీ పొత్తు పెట్టుకుని రాబోయే ఎన్నికల్లో టీడీపీపై పోటీ చేయాలని మంత్రి సవాలు విసిరారు. తిత్లీ తుపాను దెబ్బకు తీవ్రంగా దెబ్బతిన్న శ్రీకాకుళం జిల్లాకు కేంద్రం కనీస సాయం అందించకపోవడం దారుణమన్నారు.